Share News

అప్రమత్తతతో వాహనాలు నడపాలి

ABN , Publish Date - Oct 04 , 2024 | 10:37 PM

ప్రతీ ఒక్కరు అప్రమత్తతో వాహనాలు నడపాలని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం హెడ్‌క్వార్టర్‌లో కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పోలీసు వాహనాలు నడిపే డ్రైవర్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అప్రమత్తతతో వాహనాలు నడపాలి

బెల్లంపల్లి, అక్టోబరు 4: ప్రతీ ఒక్కరు అప్రమత్తతో వాహనాలు నడపాలని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం హెడ్‌క్వార్టర్‌లో కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పోలీసు వాహనాలు నడిపే డ్రైవర్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ పోలీసు వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తతతో వాహనాలు నడపాలన్నారు. వాహనం నడిపే సమయంలో చిన్న నిర్లక్ష్యం చేసినా కుటుంబాలు రోడ్డు పాలవుతాయని పేర్కొన్నారు. ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, రోజు వాకింగ్‌, యోగా చేయాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ కుటుంబీకులతో ఆనందంగా గడపాలని పేర్కొన్నారు. వాహనాల కండీషన్‌ ఏ విధంగా ఉందో గ్రహించాలన్నారు. వాహనం నడిపే సమయంలో ఏకాగ్రతతో ఉండాలని, చిన్న నిర్లక్ష్యం చేసినా భవిష్యత్‌ అంధకారంలోకి వెళుతుందన్నారు. రోడ్డుభద్రత నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, ఏఆర్‌ఏసీపీ సురేందర్‌రావు, వన్‌టౌన్‌సీఐ దేవయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసులు ప్రజలతో సత్సంబంధాలను మెరుగు పర్చుకోవాలి

కాసిపేట, అక్టోబరు 4 : పోలీసులు ప్రజలతో సత్సంబంధాలను మెరుగు పర్చుకోవడం వల్లనే నేరాలను నియంత్రించవచ్చని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం దేవాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించి పోలీసులతో సమావేశం నిర్వహించి రికార్డులను పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ కమిషనరేట్‌ పరిధిలో కొత్తగా పోలీసుల పల్లె నిద్ర చేపట్టాలని, దీంతో ప్రజలకు, పోలీసుల మధ్య మంచి సంబంధాలు మెరుగుపడడంతోపాటు ప్రజల సమస్యలను తెలుసుకోవచ్చన్నారు. సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. దేవాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని, ఆత్మహత్యల నివారణకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పోలీసులకు సూచించారు. మత్తు పదార్ధాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మత్తు పదార్ధాల నిర్మూలనకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్లపై ఆకతాయిల ఆగడాలు మితిమిరితే సహించేది లేదని, చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం లేడీ కానిస్టేబుళ్ల కొరత ఉందని, దేవాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు లేడీ కానిస్టేబుళ్లను కొనసాగించ లేకపోయామని, త్వరలోనే ప్రభుత్వం పోలీసు నియామకాలను చేపడుతుందని, అనంతరం ఖాళీగా ఉన్న పోలీస్‌స్టేషన్‌లకు లేడీ కానిస్టేబుళ్లను నియమిస్తామన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. డయల్‌ 100 ఫిర్యాదుల పట్ల వేగంగా స్పందించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, నేరాల నియంత్రణపై తెలుసుకున్నారు. స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ఏసీపీ రాఘవేందర్‌రావు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, జైపూర్‌ ఎస్‌ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 10:37 PM