Share News

Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం..

ABN , Publish Date - Jul 02 , 2024 | 03:37 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపి అధ్యయనం చేయించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలతో ఒక నివేదికను తయారు చేసి, త్వరగా ప్రభుత్వానికి అందజేయాలన్నారు.

Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం..

  • త్వరలో సర్కారుకు నివేదిక ఇవ్వండి: భట్టి విక్రమార్క

  • బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట: పొంగులేటి

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపి అధ్యయనం చేయించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలతో ఒక నివేదికను తయారు చేసి, త్వరగా ప్రభుత్వానికి అందజేయాలన్నారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని చెప్పారు. సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితో కలిసి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార-పౌర సంబంధాల శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో పేదలకు అక్కడి ప్రభుత్వాలు నిర్మిస్తున్న ఇళ్ల నమూనాలు, లబ్ధిదారుల ఎంపిక విధానంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.


ఇందిరమ్మ ఇళ్లకు సోలార్‌ విద్యుత్తు ఏర్పాటు తప్పనిసరని.. నిర్మాణ సమయంలోనే సోలార్‌ విద్యుత్తు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధ్యయనానికి హౌసింగ్‌ శాఖ అధికారులు మూడు బృందాలుగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. చెన్నై, బెంగళూర్‌, ముంబైలలో ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక తదితర విషయాలపై అధ్యయనం చేస్తారని, ఆ తర్వాత నివేదిక ఇస్తామని తెలిపారు. పేదవాడి ఆకలి తీర్చడం ఎంత ముఖ్యమో తలదాచుకోవడానికి నీడ కల్పించడం అంతకన్నా ముఖ్యమని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ ఏడాది పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను నిర్మించబోతున్నామన్నారు. వచ్చే బడ్జెట్లోనూ నిధుల కేటాయింపునకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 22.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వెల్లడించారు.

Updated Date - Jul 02 , 2024 | 03:38 AM