BRS : ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి
ABN , Publish Date - Sep 02 , 2024 | 04:55 AM
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
గురుకులాల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
715 మంది అస్వస్థతకు గురైనా పట్టించుకోరా?
హరీశ్, గంగుల, జగదీశ్‌రెడ్డి
దేవరకొండ/శంషాబాద్ రూరల్, సెప్టెంబరు 1: కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలను ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమెల్యే రవీంద్రకుమార్‌లతో కలిసి వారు సందర్శించారు. గురుకులంలో ఎలుకలు కరిచిన విద్యార్థులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గురుకులాల్లో 715 మంది విద్యార్థులను ఎలుకలు, కీటకాలు కరిచి ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దిన గురుకులాలను కాంగ్రెస్ సర్కారు విధ్వంసం చేసిందన్నారు. కనీస వసతులు, సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. సీఎం హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నారని, గురుకులాల స్థితిగతులను పట్టించుకోవడం లేదని వారు ధ్వజమెత్తారు.
బురద జల్లడమే బీఆర్‌ఎస్ పని: దుద్దిళ్ల
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాల్మాకుల కేజీబీవీలో పనిచేస్తున్న 9 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఉపాధ్యాయుల మధ్య విభేదాల కారణంగా విద్యాలయంలో సమస్యలు వచ్చాయని గుర్తించామని, అందుకే బదిలీ చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆదివారం విద్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బురద జల్లడం కోసమే బీఆర్‌ఎస్ నాయకులు హరీశ్‌రావు, సబితారెడ్డి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులతో ధర్నాలు రాస్తారోకోలు చేయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.