Share News

CM Revanth : కలెక్టర్లు కదలాలి

ABN , Publish Date - Jul 03 , 2024 | 05:44 AM

జిల్లా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కలెక్టరేట్లకే పరిమితమవుతున్నారని, కార్యాలయాలు దాటి వెళ్లడం లేదని తప్పుబట్టారు.

CM Revanth : కలెక్టర్లు కదలాలి

  • కలెక్టరేట్లు దాటి బయటకు రాకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి

  • సీనియర్‌ ఐఏఎస్‌లు జవాబుదారీగా ఉండాలి

  • ఒక్కో అధికారి ఒక ఫ్లాగ్‌షిప్‌ ఐడియా ఇవ్వాలి

  • తెలంగాణను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి

  • అధికారులపై ప్రభుత్వానికి రాగద్వేషాలు లేవు

  • పనితీరు ఆధారంగానే ఉన్నతావకాశాలు

  • వారానికి ఒకరోజు విధిగా జిల్లాలకు వెళ్లాలి

  • నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్షించాలి

  • ఐఏఎస్‌లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం

  • వారానికో జిల్లాలో పర్యటిస్తానని వెల్లడి

  • సీఎంఆర్‌ఎఫ్‌ అక్రమాలకు చెల్లు

  • ఇక ఆన్‌లైన్లో.. వెబ్‌సైట్‌ ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కలెక్టరేట్లకే పరిమితమవుతున్నారని, కార్యాలయాలు దాటి వెళ్లడం లేదని తప్పుబట్టారు. ఇలాగైతే ప్రజల సమస్యలు తెలియవని, క్షేత్ర స్థాయికి వెళితేనే ప్రజలకు సరైన న్యాయం చేయగలుగుతారని అన్నారు. ఈ విషయంలో తగిన చొరవ తీసుకోవాలని, కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను కలెక్ట్లర్లు అప్పుడప్పుడు సందర్శించాలని సూచించారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనలు, దుర్ఘటనలన్నింటిపైనా సత్వరమే స్పందించాలన్నారు.

మంగళవారం సచివాలయంలో అన్ని శాఖల, విభాగాల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల బాధ్యతలు చూస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా పని చేయాలని ఆదేశించారు. తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజా పాలన అందించేందుకు అందరూ బాధ్యతగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పని చేసి ప్రజలకు సుపరిపాలన అందించాలన్నారు.

దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఐఏఎ్‌సలపైనే ఉందన్నారు. తమ శాఖల పని తీరును మెరుగుపరుచుకునేందుకు అవసరమైతే అధికారులు, సిబ్బందిని ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూ త్న ఆలోచనలతో ముందుకు సాగాలని, వాటిని ఎప్పటికప్పుడు నేరుగా సీఎంవోతో పంచుకోవాలన్నారు. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్‌షిప్‌ ఐడియాను రెండు వా రాల్లో ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశించారు.


అనుభవాన్ని చాటుకోండి..

ఉమ్మడి రాష్ట్రం నుంచి పలువురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవశీలురైన అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాథమ్యాలను గుర్తించి, తమ పనితీరును చాటుకోవాలన్నారు. ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వహించాలని, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే.. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేసిందని చెప్పారు. తర్వాత వంద రోజుల పాటు ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయని,

ఇకపై అధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు. ఐఏఎ్‌సలు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, ప్రతి రోజూ నిర్దేశిత సమయంలోగా సచివాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒకరోజు విధిగా జిల్లాలకు క్షేత్ర పర్యటనకు వెళ్లాలని, నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. సంబంధిత విభా గం చేపట్టిన కార్యక్రమాలు, జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వానికి వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, పని తీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలుంటాయని చెప్పారు. బాగా పని చేసేవారికి ప్రోత్సాహకాలుంటాయని ప్రకటించారు. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలన్నారు.

వారానికో జిల్లాలో పర్యటిస్తా: సీఎం రేవంత్‌

త్వరలోనే వారానికో జిల్లాలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతోపాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానన్నారు. అక్కడి ప్రజలను కలుసుకునేలా తన పర్యటన ఉంటుందని తెలిపారు. త్వరలోనే జిల్లా పర్యటనల షెడ్యూలును విడుదల చేస్తామన్నారు. మొత్తం 29 విభాగాలకు చెందిన ఐఏఎస్‌ అధికారులు హాజరైన ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 05:44 AM