Share News

Government Hospitals: ఆ మందులతో కాలం చెల్లినట్లే!

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:02 AM

రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లిన మందులు నిల్వ ఉంటున్నాయి. వైద్య సిబ్బంది అలాంటి ఔషధాలను సకాలంలో గుర్తించి వెనక్కి పంపడం లేదు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది.

Government Hospitals: ఆ మందులతో కాలం చెల్లినట్లే!

  • రోగుల ప్రాణాలతో వైద్య శాఖ చెలగాటం

  • గడువు ముగిసిన ఔషధాలపై నిర్లక్ష్యం

  • సకాలంలో వాటిని వెనక్కి పంపని వైనం

  • ఎక్స్‌పైరీ మందులతో రూ.390 కోట్ల నష్టం

  • తాజాగా నిర్మల్‌ జిల్లాల్లో కాలం చెల్లిన

  • సెలైన్‌ను రోగికి ఇచ్చిన ఆస్పత్రి సిబ్బంది!

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లిన మందులు నిల్వ ఉంటున్నాయి. వైద్య సిబ్బంది అలాంటి ఔషధాలను సకాలంలో గుర్తించి వెనక్కి పంపడం లేదు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. కొన్నిసార్లు వైద్య సిబ్బంది కాలం చెల్లిన మందులనే రోగులకు ఇస్తున్నారు. తాజాగా నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగికి గడువు మీరిన సెలైన్‌ ఎక్కించారు. ఇదే ఆస్పత్రిలో మరికొన్ని కాలం చెల్లిన మందులు ఉన్నట్లు తేలింది. ఒక్క ఖానాపూర్‌లోనే కాదు.. చాలా ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆస్పత్రుల్లో గడువు మీరిన మందులను గుర్తించడం లేదు.


కాలం చెల్లిన మందుల విషయంలో ఏం చేయాలన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలూ లేవని వైద్యవర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గడువు తీరిపోయే ఔషధాలను 3 నెలల ముందే గుర్తించి, వాటిని తక్షణమే వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ వేగంగా వినియోగంలోకి రాని మందులు ఆస్పత్రిలో ఉంటే.. వెంటనే వాటిని సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్లకు పంపాలి. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ)కు పంపుతారు.


అయితే కొన్ని కంపెనీలు ఇలాంటి ఔషధాలను తిరిగి తీసుకోవడం లేదని, ఆర్డర్‌ పెట్టి.. ఎందుకు తిప్పి పంపుతున్నారని ప్రశ్నిస్తున్నాయని సమాచారం. ఇక, కాలం చెల్లిన మందులను ఏం చేయాలో తెలియక చాలా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది వాటిని మురుగు కాల్వల్లో పడేయడం, ఆస్పత్రుల ప్రాంగణంలోనే గొయ్యి తవ్వి పూడ్చిపెట్టడడం చేస్తున్నారు. వాస్తవానికి కాలం చెల్లిన మందుల విషయంలో మూణ్నెల్లకోసారి సమీక్ష నిర్వహించాలి. వాటిని ఏం చేయాలన్న దానిపై కమిటీ వేసి, స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలి.


  • సీఎంఎస్‌ కేంద్రాల నిల్వ సౌకర్యాల్లో లోపాలు

ఔషధాలను నిల్వ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 12 సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్లు (సీఎంఎస్‌) ఉన్నాయి. టీజీఎంఎ్‌సఐడీసీ కొనుగోలు చేసిన ఔషధాలు కంపెనీల నుంచి నేరుగా సీఎంఎ్‌సలకు చేరుకుంటాయి. అక్కడి నుంచి సమీప ఆస్పత్రులకు పంపుతుంటారు. అయితే రాష్ట్రంలోని కొన్ని సీఎంఎస్‌ కేంద్రాల్లో ఔషధాలను నిల్వ చేసేందుకు అవసరమైన కనీస సౌకర్యాలు లేవని సమాచారం. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ సీఎంఎ్‌సల్లో ఔషధాల నిల్వ సౌకర్యాల్లో లోపాలున్నాయని, దాంతో ఔషధ నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని కాగ్‌ నివేదికలో కూడా వెల్లడైంది.


కాగా, గతంలో గడువు మీరడానికి దగ్గరలో ఉన్న ఔషధాలను కొనుగోలు చేసి, వాటిని ఆస్పత్రులకు పంపి, అనంతరం ఎవరికీ తెలియకుండా వాటిని నాశనం చేసిన సంఘటలు కూడా జరిగాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అడ్డగోలుగా ఔషధాలను కొనుగోలు చేసి, వాటిని వినియోగించకపోవడం వల్ల 2016-22 మధ్య కాలంలో ప్రభుత్వానికి రూ.390 కోట్ల నష్టం జరిగినట్లు కాగ్‌ నివేదికలో వెల్లడించింది.

Updated Date - Aug 11 , 2024 | 03:02 AM