Share News

Krishna basin: కృష్ణమ్మ బిరబిరా.. శ్రీశైలం కళకళ!

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:28 AM

కృష్ణా పరిధిలో ఎగువన వర్షాలు, వరదలతో నది పరిధిలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ వచ్చేసింది.

Krishna basin: కృష్ణమ్మ బిరబిరా.. శ్రీశైలం కళకళ!

  • సగానికి పైగా నిండిన ప్రాజెక్టు.. 2.58 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. అల్మట్టి నుంచి 3లక్షల క్యూసెక్కులు

  • కాళేశ్వరం వద్ద 13 మీటర్ల ఎత్తులో గోదావరి

  • భద్రాచలం వద్ద 48.6 అడుగుల ఎత్తులో ప్రవాహం

  • పలుచోట్ల వర్షాలు.. ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లిలో 7.4 సెం.మీ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కృష్ణా పరిధిలో ఎగువన వర్షాలు, వరదలతో నది పరిధిలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ వచ్చేసింది. ఇప్పటికే ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 109.01 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలంలోకి ప్రస్తుతం 2.58 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది జలవిద్యుతత్తు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తూ.. 45 వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. ఫలితంగా సాగర్‌కు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.


ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6,500 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. 105.79 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో ప్రస్తుతం 101.73 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి 98392 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 98,360 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పరిధిలో వరద కొంత తగ్గినా మళ్లీ ఉధృతమైంది. కాళేశ్వరం వద్ద గోదావరి 13 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి నదులకు భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.


మేడిగడ్డ బ్యారేజీకి 9.89 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి 10.74 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌(దుమ్ముగూడెం)కు 11 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 47.8 అడుగుల ఎత్తులో ప్రవాహం సాయంత్రానికి 48.6 అడుగుల ఎత్తుకు చేరింది. ఫలితంగా మరోసారి రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.


  • ఆసిఫాబాద్‌లో జలదిగ్బంధంలో 12 గ్రామాలు

ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోండటంతో ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలంలోని తలాయి-పాపన్నపేట, కుశ్నపల్లి-సోమిని గ్రామాల మద్య వంతెనలపై వరద నీరు ప్రవహిస్తోంది. పలితంగా ఆ పరిధిలో 12 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నాటు పడవల మీద దాటుతూ ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకుంటున్నారు. బ్యాక్‌వాటర్‌ పోటెత్తడంతో పత్తి, వరి తదదితర పంటలు నీట మునిగాయి. ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం కల్లె గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కల్లెగాం జలపాతం కనువిందు చూస్తోంది. ప్రవాహాన్ని తిలకించేందుకు సందర్శకులు విచ్చేస్తున్నారు.


శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లిలో 7.4 సెం.మీ, మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలో 4.4 సెం.మీ, పెద్దపల్లి జిల్లా మంథనిలో 3.2 సెం.మీ, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో 2.5 సెం.మీ, కామారెడ్డి జిల్లా డొంగ్లిలో 2.2 సెం.మీ, కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో 2.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం గుట్టపై ఉన్న డార్మిటరీ హాలు గోడలు, పిల్లర్ల జాయింట్ల నుంచి వర్షపు నీరు కారుతుండటంతో హాల్లో కూర్చునేందుకు భక్తులకు ఇబ్బందులెదురవుతున్నాయి.

Updated Date - Jul 27 , 2024 | 04:28 AM