Share News

G. Kishan Reddy: సవాళ్లను అధిగమించి సంపన్న దేశంగా మార్చండి

ABN , Publish Date - Aug 18 , 2024 | 03:20 AM

దేశ భవిష్యత్‌ యువ పట్టభద్రులపైనే ఆధారపడి ఉందని, స్వాతంత్య్రదిన శత వార్షికోత్సవాల్లోపు దేశాన్ని సంపన్న దేశంగా మార్చే బాధ్యత యువతపైనే ఉందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు.

G. Kishan Reddy: సవాళ్లను అధిగమించి సంపన్న దేశంగా మార్చండి

  • యువ పట్టభద్రులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

  • ఘనంగా ‘వీఐటీ చెన్నై’ స్నాతకోత్సవం

చెన్నై, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : దేశ భవిష్యత్‌ యువ పట్టభద్రులపైనే ఆధారపడి ఉందని, స్వాతంత్య్రదిన శత వార్షికోత్సవాల్లోపు దేశాన్ని సంపన్న దేశంగా మార్చే బాధ్యత యువతపైనే ఉందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. ‘వీఐటీ చెన్నై’ క్యాంప్‌సలో శనివారం ఉదయం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని సందేశమిచ్చారు. నాణ్యమైన విద్యనందించడంలో వీఐటీ విద్యాసంస్థలు ముందంజలో ఉన్నాయన్నారు.


యువకులు ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా పలువురికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. వీఐటీ వ్యవస్థాపక చాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.విశ్వనాధన్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ.. విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చేటప్పుడు తాను ఆ నిర్ణయానికి మద్దతుగా ఓటు వేశానని, ప్రస్తుతం విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించినంతమేరకు నిధులు విడుదల చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు.


ముందుగా 3.55 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 17 అంతస్తులతో నిర్మించిన డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాధన్‌ బ్లాక్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ స్నాతకోత్సవంలో వివిధ కోర్సులకు సంబంధించిన మొత్తం 3,056 మంది విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారు. ఇందులో యూజీ నుంచి 2144 మంది, పీజీ నుంచి 817 మంది పట్టాలు స్వీకరించారు. 38 మంది స్వర్ణపతకాలు అందుకోగా, 95 మంది పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు.

Updated Date - Aug 18 , 2024 | 03:20 AM