Share News

High Court: పిల్లలు మరణిస్తే తప్ప.. స్పందించరా

ABN , Publish Date - Nov 28 , 2024 | 03:31 AM

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార కల్తీ, మధ్యాహ్న భోజనం వికటించడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రధానంగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఒకే వారంలో మూడుసార్లు ఫుడ్‌ పాయిజన్‌ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

High Court: పిల్లలు మరణిస్తే తప్ప.. స్పందించరా

  • ఒకే పాఠశాలలో వారంలో 3 సార్లు ఆహార కల్తీయా?

  • మీరు మనుషులు కాదా? డీఈవో నిద్రపోతున్నారా?

  • నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఇస్తే 5 నిమిషాల్లో ఇక్కడుంటారు

  • మధ్యాహ్న భోజనం నిధుల అక్రమాల్లో మీ వాటా ఎంత?

  • అధికారులు సిగ్గుపడాలి.. ప్రభుత్వ నిర్లక్ష్యమూ ఉంది

  • మాగనూరు జడ్పీ పాఠశాల ఘటనపై హైకోర్టు ఆగ్రహం

  • ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపాలని ఆదేశాలు

  • బయట చిరుతిళ్ల వల్లే అలా జరిగింది: ఏఏజీ

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార కల్తీ, మధ్యాహ్న భోజనం వికటించడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రధానంగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఒకే వారంలో మూడుసార్లు ఫుడ్‌ పాయిజన్‌ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ మీరు మనుషులు కాదా? మీకు పిల్లలు లేరా?’ అంటూ అధికారుల తీరును తప్పుబట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో.. ప్రమాణాలకు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని, ప్రైవేటు పాఠశాలల్లో పీఎం పోషణ్‌ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న ఆహార కల్తీ ఘటనలు, విద్యార్థుల మరణాల వంటి అంశాలను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మాగనూరు జడ్పీ హైస్కూల్‌లో ఒకే వారంలో వరుసగా మూడుసార్లు కల్తీ ఆహారం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు. ‘ఏబీఎన్‌- ఆంధ్య్రజ్యోతి’ లో వచ్చిన కథనాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఒకే పాఠశాలలో ఇన్నిసార్లు తప్పులు జరుగుతుంటే డీఈవో, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు మరణిస్తే గానీ అధికారులు స్పందించరా? డీఈవో నిద్ర పోతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది’’ అంటూ మండిపడింది.


  • అక్రమాల్లో మీ వాటా ఎంత?

అధికారుల వివరణ తీసుకోవడానికి వారం రోజులు సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘తెలంగాణ వంటి చిన్న రాష్ట్రంలో ఒక అధికారి వివరణ తీసుకోవడానికి వారంరోజులు ఎందుకు? ఆయ నేమైనా మైనస్‌ 30 డిగ్రీల చలిప్రాంతంలో పనిచేస్తున్నారా? అక్కడ ఫోన్‌, ఇంటర్నెట్‌ లేవా? నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటారు. భవిష్యత్తు తరాలైన విద్యార్థుల పట్ల ఇలాగేనా వ్యవహరించేది? డీఈవో సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తాం. మధ్యాహ్న భోజన పథకం అక్రమాల్లో మీ వాటా ఎంత? ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వాధికారులు సిగ్గుపడాలి’’ అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో వివరాలు తెలుసుకోవడానికి ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ మధ్యాహ్నం వరకు సమయం కోరడంతో విచారణ వాయుదా పడింది. మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ వాదిస్తూ.. పాఠశాలలో దాదాపు 400 మంది వరకు పిల్లలు ఉన్నప్పటికీ.. కొంతమంది విద్యార్థులు బయట చిరుతిళ్లు కొనుగోలు చేసి తినడం వల్లే ఇలా జరిగినట్లు తెలిసిందని పేర్కొన్నారు. విద్యార్థులను అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఆహారకల్తీ జరిగిన పాఠశాల్లో నమూనాలను ల్యాబ్‌ పరీక్షలకు పంపాలని, ఫుడ్‌పాయిజన్‌ ఘటనలపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని పేర్కొంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.


  • ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు పునరావృతం కావొద్దు

మాగనూరు పరిశీలనలో రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టర్‌

మాగనూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు పునరావృతం కాకూడదని రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టర్‌ వెంకటనరసింహారెడ్డి ఆదేశించారు. ఉపాధ్యాయులు రొటేషన్‌ పద్ధతిలో ప్రతిరోజూ మధ్యాహ్న భోజనానికి నాణ్యతా ప్రమాణాలు కలిగిన వంట సామగ్రి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంగళవారం ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ యోగే్‌షగౌతమ్‌, అదనపు కలెక్టర్‌ బెన్‌షాలంతో కలిసి వెంకట నరసింహారెడ్డి బుధవారంసదరు పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలోని 9, 10వ తరగతుల విద్యార్థులు 15 మందితో కమిటీ ఏర్పాటు చేసి రోజూ ఇద్దరు చొప్పున వంట వండేపరిసరాలను పరిశీలిస్తూ ఉండాలని, వంట వండిన తరువాత ఉపాధ్యాయులు విద్యార్థులతో కూడిన ఫుడ్‌ కమిటీ సభ్యులు తిన్న తరువాతే విద్యార్థులందరికీ వడ్డించాలని సూచించారు.పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వెళ్లి పరీక్షలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సౌభాగ్యలక్ష్మిని ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో కలిసి పాఠశాలలో ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులు గ్రామ మహిళాసమాఖ్య సభ్యులు, 10వ తరగతి విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి మంగళవారం జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.

Updated Date - Nov 28 , 2024 | 03:31 AM