Share News

Danam Nagender: బయటికిరా.. తోలు తీస్తా

ABN , Publish Date - Aug 03 , 2024 | 04:00 AM

చివరిరోజైన శుక్రవారం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. జాబ్‌ క్యాలెండర్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటన అనంతరం.. జాబ్‌ క్యాలెండర్‌పై మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ సభాపతిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ కోరగా తిరస్కరించారు.

Danam Nagender: బయటికిరా.. తోలు తీస్తా

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో దానం

  • ఇక్కడే చూసుకుందాం: కౌశిక్‌ అక్బరుద్దీన్‌ సూచనతో క్షమాపణ కోరిన దానం

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఉద్దేశించి దానం వ్యాఖ్యలు

  • బయటెందుకు ఇక్కడే చూసుకుందాం.. రా: కౌశిక్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): చివరిరోజైన శుక్రవారం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. జాబ్‌ క్యాలెండర్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటన అనంతరం.. జాబ్‌ క్యాలెండర్‌పై మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ సభాపతిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ కోరగా తిరస్కరించారు. దీనిపై కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరుస్తూ సభను అడ్డుకునేందుకు యత్నించారు. ప్రకటనపై చర్చ ఉండదంటూ శాసనసభ నియమావళిని భట్టి చదివి వినిపించారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సభాపతి పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. అప్పటికే భట్టి, శాసనమండలికి వెళ్లారు. డిప్యూటీ సీఎం వచ్చాక మాట్లాడే అవకాశం ఇస్తానని సభాపతి అనేకసార్లు పేర్కొన్నా.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శాంతించలేదు. దాదాపు 20 నిమిషాలు పాటు పోడియం వద్దే నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన సాగుతుండగానే హైదరాబాద్‌ మెట్రో సిటీపై లఘు చర్చ మొదలైంది.


ఇటివలే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె స్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రసంగిస్తున్నారు. ఆయన తన ప్రసంగం కొనసాగిస్తుండగా.. కౌశిక్‌ రెడ్డి ప్రచురించడానికి వీల్లేని ఓ పదం ఉపయోగించారు. దీనిపై దానం నాగేందర్‌.. ‘‘తోలు తీస్తా.. ఏమనుకుంటున్నార్రా మీరు?’’ అని హెచ్చరించారు. ‘‘బయటకు రారా.. చూసుకుందాం.. బయట తిరగనియ్యకుండా చేస్తా’’ అంటూ దానం కూడా ప్రచురించడానికి వీల్లేని పదం వాడారు. దీనిపై కౌశిక్‌ రెడ్డి.. ‘‘బయటెందుకు.. ఇక్కడే చూసుకుందాం’’ అంటూ మరింత రెచ్చగొట్టారు. దానం నాగేందర్‌ మరింత ఆగ్రహంతో తన స్థానం నుంచి కౌశిక్‌ రెడ్డివైపు కదిలారు. స్పీకర్‌ పోడియం నుంచి కౌశిక్‌ రెడ్డి సైతం ఆయనవైపు వచ్చారు. ఫలితంగా సభలో ఒక్కసారి గందరగోళం నెలకొంది. దానం నాగేందర్‌కు మద్దతుగా 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పక్కకు చేరారు.


సభ ఒక్కసారిగా అదుపు తప్పడంతో 25 మంది మార్షల్స్‌ను లోనికి పిలిపించారు. దానం నాగేందర్‌ భాషపై కేటీఆర్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఇతర సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభనుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం సభలో దానం ప్రసంగం కొనసాగిస్తుండగా.. అప్పుడే సభలోకి హాజరైన మజ్లిస్‌ పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడారు. సభా మర్యాదను కాపాడాల్సిన సభ్యులు ఇలాంటి పదజాలం వాడటం సరికాదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు క్షమాపణ చెప్పాలని కోరారు. దీనికి దానం స్పందిస్తూ.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాయని, సభా మర్యాద గురించి తనకు తెలుసని, అయినా తన మాటలు ఎవరికైనా బాఽధకలిగిస్తే క్షమాపణ కోరుతున్నానని అన్నారు.

Updated Date - Aug 03 , 2024 | 04:00 AM