Justice Pinakichandra Ghosh: ‘కాళేశ్వరం’పై అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:00 AM
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంతో ముడిపడిన అంశాలపై వివరాలు చెప్పే అధికారులు.. వాటికి కట్టుబడి ఉండాలని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ అన్నారు. విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్‌లో పొందుపరచాలన్నారు. అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలు వాస్తవ విరుద్ధంగా ఉంటే ఆయా అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటో చెప్పాలి
విచారణలో చెప్పిందే అఫిడవిట్‌లో ఉండాలి
అధికారులకు జస్టిస్ పీసీ ఘోష్ హెచ్చరిక
25లోగా అఫిడవిట్ల దాఖలుకు నిర్దేశం
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంతో ముడిపడిన అంశాలపై వివరాలు చెప్పే అధికారులు.. వాటికి కట్టుబడి ఉండాలని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ అన్నారు. విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్‌లో పొందుపరచాలన్నారు. అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలు వాస్తవ విరుద్ధంగా ఉంటే ఆయా అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ నెల 25వ తేదీలోగా అఫిడవిట్లను అందజేయాలని ఆదేశించారు. ఏ కారణాలతో బ్యారేజీల వైఫల్యం జరిగిందో సవివరంగా కమిషన్‌కు వివరించాల్సిందేనని స్పష్టం చేశారు.
కాళేశ్వరంలోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ, నాణ్యత, నిర్వహణ లోపాలు, అవినీతి, నిధుల దుర్వినియోగాన్ని వెలికితీసి.. వాటికి బాధ్యులను గుర్తించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ మంగళవారం క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లను పలు అంశాలపై ప్రశ్నించారు. వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీల స్థితిగతులపై తెచ్చుకున్న నివేదికలపై స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డీఎ్‌సవో) అధికారులను విచారించారు.
బ్యారేజీల నాణ్యత ఏ విధంగా ఉందని క్వాలిటీ కంట్రోల్ అధికారులను ప్రశ్నించారు. అనంతరం విచారణ జరుగుతున్న తీరును ఆయన విలేకరులకు వివరించారు. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణం, నాణ్యత వంటి అంశాలపై అధికారులను పిలిచి వివరాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులనూ పిలుస్తామన్నారు. కమిషన్‌కు 54 మంది దాకా ఫిర్యాదులు చేశారని, వీటిలో భూసేకరణ, పరిహారానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయని, వీటిని ప్రభుత్వానికి నివేదించామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలే కాకుండా ఇతర కాంపోనెంట్లపై కూడా ఫిర్యాదులు అందాయని, అవి విచారణ పరిధిలో లేనందున.. వాటిపై ఏం చేయాలనే దానిపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు.
సాంకేతిక అంశాలను తెలుసుకోవడానికే..
విచారణలో భాగంగా అధికారులు అందించిన వివరాలు, కాగ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల నివేదికలతోపాటు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలన్నింటినీ పరిశీలించాక.. తదుపరి ఎవరెవరిని పిలవాలనే దానిపై నిర్ణయం ఉంటుందని జస్టిస్ పీసీ ఘోష్ అన్నారు. ప్రస్తుతం సాంకేతిక అంశాలను పరిశీలించడానికి/తెలుసుకోవడానికే పిలుస్తున్నామని, ఆ తరువాత ఉల్లంఘనలపై దృష్టి పెడతామని అన్నారు. కమిషన్ విచారించిన వారిలో ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం) బి.నాగేంద్రరావు, మహబూబ్‌నగర్ చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నూనె శ్రీధర్, ఓంకారేశ్వర సింగ్ తదితరులు ఉన్నారు.