Share News

Special Buses: వినాయక నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలకు టీజీఎస్ఆర్టీసీ చెక్..

ABN , Publish Date - Sep 17 , 2024 | 10:56 AM

నిమజ్జన కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున ట్యాంక్ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రజలు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు పడకుండా టీజీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది.

Special Buses: వినాయక నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలకు టీజీఎస్ఆర్టీసీ చెక్..

హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఖైరతాబాద్ గణనాథుడి సహా అనేక చిన్నా, పెద్ద విగ్రహాలు శోభాయాత్రకు బయలుదేరాయి. పెద్దఎత్తున భక్తులు రోడ్లపై నృత్యాలు, కోలాటాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే భారీ సంఖ్యలో వాహనాలు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌ వైపు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి. ఆయా మార్గాల గుండా వెళ్లేందుకు గంటల తరబడి సమయం పడుతోంది. అయితే ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. అలాగే ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఇప్పటికే ప్రత్యేక రూట్ మ్యాప్ సైతం విడుదల చేశారు.

ganesh-2.jpg


600ప్రత్యేక బస్సులు..

నిమజ్జన కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున ట్యాంక్ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రజలు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు పడకుండా టీజీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ స‌మీప ప్రాంతాల‌కు ఇవాళ (మంగ‌ళ‌వారం) 600 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. " నిమజ్జనాల వేళ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ స‌మీప ప్రాంతాల‌కు ఆర్టీసీ 600 బస్సులు నడుపుతోంది. బ‌షీర్‌ బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లిబ‌ర్టీ-టీటీడీ క‌ల్యాణ‌ మండపం, ఇందిరాపార్క్, ల‌క్డీకాపూల్, ఖైర‌తాబాద్, ఆలిండియా రేడియో, త‌దిత‌ర ప్రాంతాల వ‌ర‌కూ స్పెష‌ల్ బ‌స్సులు న‌డుస్తాయి. ఆయా ప్రాంతాల వ‌ద్ద ర‌ద్దీకి అనుగుణంగా బ‌స్సుల‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచేందుకు డిప్యూటీ ఆర్ఎం స్థాయి అధికారుల‌ను సంస్థ నియ‌మించింది. వినాయక నిమజ్జనాలు, శోభ‌యాత్ర సంద‌ర్భంగా సొంత వాహ‌నాల్లో వెళ్లి ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగించ‌కుండా ప్రయాణికులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాల‌ని" అని సజ్జనార్ కోరారు.

ganesh-3.jpg


ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర..

మరోవైపు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. 11రోజులపాటు పూజలు అందుకున్న గణపయ్య నిమజ్జనానికి బయలుదేరాడు. భారీ ట్రక్కులో ముందుగా నిర్దేశించిన మార్గాల గుండా గణనాథుడు కదులుతున్నాడు. ఉదయం 6:15గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వరకూ పెద్దఎత్తున సాగుతోంది. వందల మంది భక్తులు నృత్యాలు చేసుకుంటూ కోలాహలంగా శోభాయాత్రలో పాల్గొంటున్నారు. మొత్తం రెండున్నర కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్ర.. ఖైరతాబాద్ మీదుగా సెన్సేషనల్ థియేటర్, రాజ్‌దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సెక్రటేరియట్, NTR మార్గ్ వరకూ కొనసాగనుంది. NTR మార్గ్‌లో ఏర్పాటు చేసిన 4వ నంబర్ క్రేన్ ద్వారా ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం 2గంటల లోపు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Balapur Laddu: బాలాపూర్ గణేశా మజాకా.. భారీ ధర పలికిన లడ్డూ

Khairatabad Ganesh: మెుదలైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర..

For more Telangana news and Telugu news click here..

Updated Date - Sep 17 , 2024 | 11:08 AM