Share News

KTR vs Revanth: కేటీఆర్ జైలుకే.. మనసులో మాట బయటపెట్టిన సీఎ రేవంత్

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:50 PM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కేటీఆర్ కుట్రలను గమనిస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు.

KTR vs Revanth: కేటీఆర్ జైలుకే.. మనసులో మాట బయటపెట్టిన సీఎ రేవంత్
Revanth Reddy and KTR

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వేములవాడలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. కొన్నేళ్లుగా వాయిదా పడుతూవస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. తమ మంత్రులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టులపై సమీక్షిస్తారని చెప్పారు. ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో కేటీఆర్‌ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.


అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించే భూమికి రైతులకు రెండు రెట్ల పరిహారం ఇస్తామన్నారు. భూములు తీసుకుని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలా పరిహారం ఇవ్వకుండా తప్పించుకోమన్నారు. భూమి మార్కెట్ ధర రూ.10 లక్షలు ఉంటే రూ.30 లక్షల పరిహారం ఇస్తామన్నారు. నష్ట పరిహారం ఎక్కువ ఇస్తే భూయజమానులు తమ భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తారన్నారు. పరిశ్రమలు రావాలంటే భూసేకరణ చేయాల్సిందేనన్నారు. తెలంగాణకు పరిశ్రమలు వద్దని బీఆర్‌ఎస్ కోరుకుంటుందా అని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉంటూ కుట్రలు చేశారంటూ కేటీఆర్‌పై రేవంత్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సక్రమంగా పరిహారం ఇవ్వలేదన్నారు. కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్కపెడతారంటూ హెచ్చరించారు. కేటీఆర్ చేసిన కుట్రలను గమనిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. ఎంత ఎగురుతావో ఎగురంటూ చురకలంటించారు. కేటీఆర్ తన వైఖరి మార్చుకోవాలని రేవంత్ పరోక్షంగా సూచించారు.


కేటీఆర్ vs రేవంత్

తెలంగాణ రాజకీయం గత కొద్దిరోజులుగా రేవంత్ వర్సెస్ కేటీఆర్‌గా నడుస్తోంది. ఓవైపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అసమర్థ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. అధికారంలోకి వచ్చిన ఏడాదవుతున్నా సీఎం రేవంత్‌కు పాలన చేతకావడంలేదని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ టార్గెట్ చేయగా.. కేటీఆర్‌ను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. రెండు పార్టీల కంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వార్‌గా తెలంగాణ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 20 , 2024 | 04:51 PM