Deputy CM Bhatti: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మీ పొలాలకు..
ABN , Publish Date - Oct 12 , 2024 | 04:24 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రైతులకు(Farmers) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శుభవార్త చెప్పారు. రైతుల బోరు బావులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా అన్నదాతలకు అదనపు ఆదాయం వస్తుందని భట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. అశ్వరావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. రూ.36కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.." న్యూ ఎనర్జీ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా రైతులకు కరెంట్ ఖర్చు ఉండదు. పైగా సోలార్ ప్యానల్స్ ద్వారా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. పంటతోపాటు పవర్‌పైనా అన్నదాతలు అదనపు లాభం పొందేలా పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నాం. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టు చేపడతాం. విజయ దశమి రోజు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో బయో మాస్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచమంతా థర్మల్ పవర్ నుంచి గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తోంది. తెలంగాణలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేశాం. బీఆర్ఎస్ పార్టీ నేతలు రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారు. మేము చేసిన మంచిని చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారు. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.73వేల కోట్లు తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించాం" అని చెప్పారు.
అనంతరం అశ్వరావుపేటలో ఆయిల్ పామ్ రైతులకు సాగు, పంట విస్తరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని, రాగమయి, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Ponguleti: ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సు.. మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
Hyderabad: కేసీఆర్ బాధితులు చాలామంది ఉన్నారు..
Jubilee Hills: పెద్దమ్మ తల్లి దేవాలయానికి పోటెత్తిన భక్తులు: నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు