Share News

Miyapur: హత్యాచార నిందితులను విడిచిపెట్టం..

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:33 AM

హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఏటిగడ్డతండాలో ఇటీవల హత్యాచారానికి గురైన గిరిజన బాలిక (12) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క హామీనిచ్చారు. నిందితులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

Miyapur: హత్యాచార నిందితులను విడిచిపెట్టం..

  • బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి సీతక్క

మరిపెడ రూరల్‌, జూన్‌ 17: హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఏటిగడ్డతండాలో ఇటీవల హత్యాచారానికి గురైన గిరిజన బాలిక (12) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క హామీనిచ్చారు. నిందితులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సోమవారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని బాలిక సొంతూరు లక్ష్మాతండాకు వెళ్లిన సీతక్క.. బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. వారికి నిత్యావసర సరుకులు, రూ.75 వేల నగదును సాయంగా అందించారు.


హైదరాబాద్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి బాలిక మృతిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. మహబూబాబాద్‌ జిల్లా ప్రాంతంలో గిరిజన బాలికలపై అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయని, పదేళ్లుగా హైదరాబాద్‌, ఇతర ముఖ్య పట్టణాలు, నగరాలు, జిల్లా కేంద్రాలతో పాటు, మండల కేంద్రాల్లో యువత గంజాయి, డ్రగ్స్‌ లాంటి వ్యసనాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషసంస్కృతిపై ఉక్కుపాదం మోపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు చేపడుతున్నారన్నారు. సీతక్క వెంట ఎంపీ పోరిక బలరాంనాయక్‌, ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్‌ ఉన్నారు.

Updated Date - Jun 18 , 2024 | 03:33 AM