Share News

Mahabubnagar: పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌దే..

ABN , Publish Date - Jun 03 , 2024 | 04:43 AM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ నిలబెట్టుకుంది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాగరకుంట నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై గెలుపొందారు.

Mahabubnagar: పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌దే..

  • స్థానిక సంస్థల ఎమ్మెల్సీఎన్నికల్లో 109 ఓట్ల

  • మెజారిటీతో గెలిచిన నవీన్‌కుమార్‌రెడ్డి

  • మొదటి ప్రాధాన్య ఓట్లలోనే తేలిన ఫలితం

  • సాంకేతికంగానే బీఆర్‌ఎస్‌ గెలుపు

  • 4 తర్వాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం: జూపల్లి

మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ నిలబెట్టుకుంది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాగరకుంట నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై గెలుపొందారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 1439 మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు ఓటుహక్కు కల్పించగా.. మార్చి 28న పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం ఓట్లలో 1437 ఓట్లు పోలయ్యాయి.


ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 2న కౌంటింగ్‌ జరగాల్సి ఉండగా అప్పటికే పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో ఆ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం ఉంటుందనే కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్‌ను జూన్‌ 2కు వాయిదా వేసింది. ఈ మేరకు ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టగా.. పోలైన మొత్తం 1437 ఓట్లలో 21 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లుబాటైన 1416 ఓట్లలో 709 ఓట్లను కోటాగా నిర్ణయించారు. అనంతరం మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డికి 762 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డికి 653 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్‌కు ఒక్క ఓటు వచ్చింది. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రవి గుగులోత్‌ ప్రకటించారు.


కాంగ్రె్‌సకు బలం పెరిగినా..

రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎ్‌సకు స్థానిక సంస్థల్లో బలం ఎక్కువగానే ఉంది. గతంలో కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంలో.. కాంగ్రె్‌సకు బలంలేని కారణంగా అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది స్థానిక సంస్థల ప్రతినిధులు కాంగ్రె్‌సలో చేరడం, ఎన్నికల్లో పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఆపరేషన్‌ ఆకర్ష్‌ ద్వారా మరికొంత మందిని చేర్చుకోవడంతో.. ఈసారి ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవవచ్చనే ఆలోచనతో పోటీకి దిగింది. దీంతో బీఆర్‌ఎస్‌ అప్రమత్తమై ముందుగానే క్యాంపులను ప్రారంభించింది. తమ సభ్యులందరినీ గోవాకు తీసుకెళ్లి క్యాంపులో ఉంచడంతోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నిరంతరం పర్యవేక్షణ చేశారు.


మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికకు ప్రత్యేకంగా ఎవరికీ ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వకపోగా, కేవలం ఎమ్మెల్యేలపైనే భారం వేసింది. ఇదే ఆ పార్టీ ఓటమికి కారణమైందని భావిస్తున్నారు. ఇక తాజా గెలుపుతో తమ సిట్టింగ్‌ స్థానాన్ని దక్కించుకున్న బీఆర్‌ఎస్‌.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో తామే పైచేయి సాధించామన్న సంతోషంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో చతికిలపడిన తమ పార్టీకి ఈ ఎమ్మెల్సీ గెలుపు పునరుజ్జీవం అవుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా, పార్టీ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన గెలుపును కానుకగా ఇస్తున్నట్లు నవీన్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అమరవీరులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నిక ఫలితం రాగానే ఆయన హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. నవీన్‌రెడ్డికి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.


నైతిక విజయం కాంగ్రె్‌సదే: జూపల్లి

మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలిచినా.. నైతిక విజయం కాంగ్రె్‌సదేనని ఆ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సాంకేతికంగా మాత్రమే గెలిచారని, 300 పైచిలుకు ఓట్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్‌ బలం 653 ఓట్లకు పెరిగిందని తెలిపారు. అసలైన ప్రజాతీర్పు జూన్‌ 4న వస్తుందని, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితమవుతుందని జూపల్లి వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఎవరూ మిగలరని అన్నారు. బీఆర్‌ఎ్‌సలాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఫిరాయింపులకు పాల్పడలేదని, తప్పుడు పద్ధతులను అవలంబించలేదని తెలిపారు. నిజాయితీగా ఎన్నికల బరిలో నిలిచిన తమ అభ్యర్థిని అభినందిస్తున్నానన్నారు పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెజారిటీ సీట్లలో విజయం సాధించబోతోందని, రాబోయే ఎన్నిక ఏదైనా కాంగ్రె్‌సదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Jun 03 , 2024 | 04:43 AM