Online Betting: ప్రాణాలు తీసిన ఆన్లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..
ABN , Publish Date - Oct 05 , 2024 | 05:55 PM
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇతను బెట్టింగులకు బానిసయ్యాడు.
నిజామాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. సులభంగా డబ్బులు సంపాదించొచ్చనే ఆశతో ఎంతోమంది బెట్టింగులు ఆడుతున్నారు. ఆ క్రమంలో దానికి బానిసలుగా మారి అప్పుల పాలవుతున్నారు. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాము ఇబ్బందులు పడటమే కాకుండా కుటుంబం మెుత్తాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. ఇలాంటి వారిలో విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. శ్రేయోభిలాషులు, పోలీసులు ఎంత హెచ్చరించినా బెట్టింగ్‌కు బానిసైన వారు వినే పరిస్థితిలో ఉండడం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయి కుటుంబాలను రోడ్డు మీదకు తెస్తున్నారు. చివరికి ఆస్తులు అమ్మినా సరిపోనంతగా అప్పులు పేరుకుపోయి.. చివరికి కుటుంబం మెుత్తం ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. అతణ్ని మంచిగా చదివించి ప్రయోజకుడిని చేయాలని తల్లిదండ్రులు భావించారు. అందుకు అనుగుణంగానే హరీశ్‌ను చదివించేందుకు రాత్రింబవళ్లు వ్యవసాయం చేస్తూ కష్టపడుతున్నారు. అయితే కుమారుడు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఎప్పుడూ ఫోన్ చూసుకుంటూ ఉండేవాడు. ఎంత మందలించినా వినిపించుకునేవాడు కాదు. దీంతో చేసేదేమీ లేక వారు చెప్పడం మానేశారు. అయితే అలా చేయడమే కుటుంబం మెుత్తం ప్రాణాలు పోవడానికి కారణం అవుతుందని ఆ రోజు వారు ఊహించి ఉండరు.
ఎప్పుడూ ఫోన్ చూస్తుండే హరీశ్ సులభంగా డబ్బులు సంపాదిద్దామని అనుకున్నాడు. పైగా ఎప్పుడూ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లు సోషల్ మీడియాలో కనిపిస్తుండడంతో వాటికి బాగా ఆకర్షితుడయ్యాడు. అనుకున్నదే తడవుగా బెట్టింగులు పెట్టడం మెుదలుపెడ్డాడు. అదే క్రమంలో దానికి బానిసగా మారిపోయాడు. దాన్ని ఆడకుండా ఉండలేకపోయాడు. అలా వందలు, వేలు, లక్షల్లో పెట్టి అప్పుల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమారుడు హరీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంత మేర అప్పు చేశావంటూ ప్రశ్నించగా రూ.30లక్షలు అంటూ షాక్ ఇచ్చాడు. దీంతో వారు గుండెలు పగిలేలా రోదించారు. అంత అప్పు ఎలా తీర్చాలంటూ తీవ్ర కలత చెందారు.
అప్పులు తీర్చేందుకు ఉన్న కాస్త పొలాన్ని అమ్మేశారు. అయినా అవి తీరలేదు. వాటిని తీర్చే మార్గమూ వారికి కనిపించలేదు. మరోవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు పెరిగిపోయాయి. దీంతో చేసేదేమీ లేక అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురూ కలిసి ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రోజూ తమతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన ఆ దంపతులు.. కుమారుడు చేసిన పనికి ప్రాణాలు తీసుకున్నారని కన్నీటిపర్యంతం అయ్యారు. ఇలాంటి కుమారుడు ఎవరికీ ఉండొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతీయువకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈజీ మనీ కోసం పాకులాడవద్దని, ముఖ్యంగా ఆన్ లైన్ బెట్టింగుల జోలికి మాత్రం వెళ్లవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: మీ అందరిపై పరువు నష్టం దావా వేస్తా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. నైవేద్యం ఇదే
Laxman: ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ దేనికి సంకేతం
Read Latest Telangana News And Telugu News