Share News

Hyderabad: పిండానికి గండం..

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:25 AM

తెలంగాణలోని పది జిల్లాల్లో గర్భస్రావాల (అబార్షన్లు) శాతం అధికంగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు అన్ని జిల్లాల్లో నమోదైన గర్భిణుల్లో 10 శాతం మందికి అబార్షన్లు అయినట్లు తేలింది. ఈ విషయాన్ని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ ఐదు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 2,84,208 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

Hyderabad: పిండానికి గండం..

  • రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అధికంగా గర్భస్రావాలు

  • సిరిసిల్ల, భూపాలపల్లిలో అత్యధికం

  • మహిళల అనారోగ్యమే ప్రధాన కారణం

  • జనవరి-మే మధ్య 2.80 లక్షల రిజిస్ట్రేషన్లు

  • వీరిలో 10 శాతం మందికి అబార్షన్‌

  • 6 శాతం.. 3 నెలలు పైబడిన గర్భిణుల్లోనే..

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని పది జిల్లాల్లో గర్భస్రావాల (అబార్షన్లు) శాతం అధికంగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు అన్ని జిల్లాల్లో నమోదైన గర్భిణుల్లో 10 శాతం మందికి అబార్షన్లు అయినట్లు తేలింది. ఈ విషయాన్ని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ ఐదు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 2,84,208 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇందులో 29,563 మందికి గర్భస్రావమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా మూడు మాసాల పైబడిన గర్భిణీల్లో అబార్షన్లు జరుగుతున్నట్లు, ఇందుకు ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణంగా వైద్య శాఖ గుర్తించింది. మొత్తం గర్భిణుల్లో 15,777 మంది (6ు) 3 మాసాలు నిండిన తర్వాత తమ గర్భాన్ని కోల్పోయినట్టు వైద్యశాఖ తన నివేదికలో పేర్కొంది.


మూడు మాసాల్లోపు గర్భస్రావం 13,786 మందిలో (4 శాతం) జరిగినట్లు పేర్కొంది. అత్యధికంగా జయశంకర్‌ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 శాతం మంది గర్భిణులకు అబార్షన్‌ అయింది. జయశంకర్‌ జిల్లాలో గత ఐదు నెలల్లో 2,741 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 505 మందికి, సిరిసిల్ల జిల్లాలో 3,983 మందిలో 708 మందికి గర్భస్రావమైంది. ఆ తర్వాత మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో 17 శాతం, వరంగల్‌, జగిత్యాల, మహబూబాబాద్‌, మెదక్‌, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 16 శాతం మంది గర్భిణులకు అబార్షన్‌ అయినట్లు వైద్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. అతి తక్కువగా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో కేవలం రెండు శాతమే గర్భస్రావాలు అయ్యాయి.


ఆ జిల్లాలో గడిచిన ఐదు నెలల్లో 29,022 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 719 మందికి అబార్షన్‌ అయినట్లు వైద్య శాఖ నివేదిక పేర్కొంది. తర్వాత వికారాబాద్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మొత్తం గర్భిణుల్లో ఏడు శాతం మందికే అటువంటి పరిస్థితి ఎదురైనట్లు ఆ నివేదిక వివరించింది. జోగులాంబ గద్వాల, నారాయణ్‌పేట జిల్లాల్లో 8 శాతం, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 9 శాతం, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో పది శాతం అబార్షన్లు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో కూడా పది శాతానికి మించి గర్భస్రావాలు అయ్యాయి. వివిధ కారణాల వల్ల గర్భస్రావం జరగవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.


క్రోమోజోమ్‌ అసాధారణతల వల్ల పిండం జన్యుపరమైన లోపాలు తలెత్తి అది మనగడ సాగించకపోవచ్చు. పిండం నిర్మాణం, ఎదుగుదలలో అసాధారణతలు మరో కారణం. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, గర్భాశయ సమస్యలు కూడా అబార్షన్‌కు దారితీస్తాయి. తల్లి రోగ నిరోధక వ్యవస్థ కూడా పిండాన్ని తిరస్కరించవచ్చని, హార్మోన్ల అసమతుల్యత పిండం అభివృద్ధికి ఆటంకం కల్గిస్తుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. వయసు 35 పైబడినా కూడా ఇటువంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు. థైరాయిడ్‌, రక్తపోటు, మధుమేహం, పీసీవోడీ, అధిక బరువు లాంటి సమస్యలు కూడా అబార్షన్లకు కారణమవుతాయని పేర్కొంటున్నారు.

Updated Date - Jun 30 , 2024 | 04:25 AM