Ponnam: కలుషితాహార ఘటనపై విచారణ
ABN , Publish Date - Nov 06 , 2024 | 02:25 AM
కలుషితాహారం తినడంతో అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గరుకుల విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం
మంత్రి పొన్నంతో కలిసి నిమ్స్‌లో వాంకిడి
గిరిజన గురుకుల విద్యార్థినులకు పరామర్శ
హైదరాబాద్ సిటీ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): కలుషితాహారం తినడంతో అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గరుకుల విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ విద్యార్థినులు ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాలు తినడం వల్లే అస్వస్థతకు గురయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారన్నారు. హాస్టల్‌లో అదే ఆహారాన్ని తిన్న సిబ్బంది ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నారని చెప్పారన్నారు.
ఆహార పదార్థాలను పరీక్షకు పంపారని, ఆ నివేదిక వచ్చిన తర్వాత ఈ ఘటనకు బాధ్యులు అధికారులని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పా రు. విద్యార్థినులను పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్‌రావు ఏదో సాకు దొరికింది కదా అని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని సురేఖ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హాస్టళ్ల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిమ్స్ డైరెక్టర్‌కు ఫోన్ చేసి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మహాలక్ష్మి, జ్యోతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శైలజకు వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నామని నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
వాంకిడిపై రాజకీయం చేయొద్దు: సీతక్క
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ ఘటనను రాజకీయం చేయటం తగదని, ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవటం ఆపాలని మంత్రి సీతక్క అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆమె ఖండించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు.