Share News

Crime News: తాండూరులో దొంగనోట్ల కలకలం..

ABN , Publish Date - Jul 20 , 2024 | 06:04 PM

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు నిందితులను తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.45వేల విలువైన 500రూపాయల నకిలీ నోట్లు 90స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చంద్రయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు మల్లంపేట బాచుపల్లికి చేరుకున్నారు. అక్కడ మరో నిందితుడు జగదీశ్ నివాసంలో ఏకంగా రూ.7.50లక్షల విలువైన నకిలీ 500రూపాయల నోట్ల స్వాధీనం చేసుకున్నారు.

Crime News: తాండూరులో దొంగనోట్ల కలకలం..

వికారాబాద్: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు నిందితులను తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.45వేల విలువైన 500రూపాయల నకిలీ నోట్లు 90స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చంద్రయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు మల్లంపేట బాచుపల్లికి చేరుకున్నారు. అక్కడ మరో నిందితుడు జగదీశ్ నివాసంలో ఏకంగా రూ.7.50లక్షల విలువైన నకిలీ 500రూపాయల నోట్ల స్వాధీనం చేసుకున్నారు. నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్, సీపీయూ, ప్రింటర్, ఐదు మొబైల్ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నారు.


కథలో ట్విస్ట్..

అయితే జగదీశ్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. నిందితుడు జగదీశ్ గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌గా పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్థాయిలో పని చేసిన వ్యక్తి ఇలాంటి వ్యవహారంలో పట్టుపడడంపై వారు అవాక్కయ్యారు. దీంతో విచారణ ముమ్మరం చేశారు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు బ్యాంకులో ఉద్యోగం చేసే సమయంలో నిధులు దుర్వినియోగం చేసినందుకు కేసు నమోదైనట్లు గుర్తించారు. ఆ కేసులో అరెస్టయ్యి అతను నెల రోజులపాటు సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్నట్లు తెలిపారు.


అదే సమయంలో జగదీశ్‌కి మరో నిందితుడు వీర వెంకటరమణ పరిచయం అయినట్లు పోలీసులు చెప్పారు. అప్పటికే వీర వెంకటరమణ కోమసీమ జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తూ దొరికిపోయిన కేసులో అదే జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు చెప్పారు. జైలు నుంచి విడుదలయ్యాక నిందితులు ఇద్దరూ నకిలీ నోట్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు చెప్పారు. వారు అనుకున్నట్లుగానే జైలు నుంచి వచ్చాక మరో వ్యక్తి శివకుమార్‌ను సైతం గ్యాంగ్‌లో కలుపుకున్నారు. అనంతరం నోట్ల ముద్రణకు సంబంధించిన యంత్రాలు కొనుగోలు చేసి ముద్రించడం ప్రారంభించారు. వాటిని చలామణి చేస్తూ తాజాగా తాండూర్ పోలీసులకు చిక్కారు. దీంతో నలుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jul 20 , 2024 | 06:04 PM