Share News

Hyderabad: ‘సమ్మక్కసాగర్‌’ నీటి వినియోగం, లభ్యతపై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:48 AM

గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న తుపాకులగూడెం(సమ్మక్కసాగర్‌) బ్యారేజీ నీటి వినియోగం/లభ్యతపై తాజాగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తెలంగాణను కోరింది. ఈమేరకు నీటిపారుదల శాఖ అధికారులకు సీడబ్ల్యూసీ లేఖ రాసింది.

Hyderabad: ‘సమ్మక్కసాగర్‌’ నీటి వినియోగం, లభ్యతపై నివేదిక ఇవ్వండి

  • తెలంగాణకు సీడబ్ల్యూసీ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న తుపాకులగూడెం(సమ్మక్కసాగర్‌) బ్యారేజీ నీటి వినియోగం/లభ్యతపై తాజాగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తెలంగాణను కోరింది. ఈమేరకు నీటిపారుదల శాఖ అధికారులకు సీడబ్ల్యూసీ లేఖ రాసింది. సమ్మక్క సాగర్‌ బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకం కింద 38 టీఎంసీలు తరలించేలా దీన్ని డిజైన్‌ చేసి అనుమతుల కోసం డీపీఆర్‌ను సమర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డీపీఆర్‌.. సీడబ్ల్యూసీలోని అన్ని డైరెక్టరేట్ల పరిశీలన పూర్తయి కీలకమైన హైడ్రాలజీ, అంతరాష్ట్ర విభాగం వద్ద పెండింగ్‌లో ఉంది. బ్యారేజీ నుంచి నీటి వినియోగం, నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇటీవలే లేఖ రాసింది. తాజాగా సిమ్యులేషన్‌ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. రూ.9,257 కోట్లతో చేపట్టిన తుపాకులగూడెం బ్యారేజీ పనులు 95శాతం మేర పూర్తయ్యాయి.


ఈ బ్యారేజీ బ్యాక్‌వాటర్‌ను దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోయడం ద్వారా పూర్వ ఖమ్మం, న ల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు నీరందించనున్నారు. ఈ బ్యారేజీకి సీడబ్ల్యూసీ కీలక అనుమతి దక్కాలంటే ఛత్తీ్‌సగఢ్‌ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) పొందాల్సి ఉంది. తుపాకులగూడెం బ్యారేజీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదని, ఆ బ్యారేజీతో తమ ప్రాంతంలో ముంపు సమస్య తీవ్రంగా ఉంటుందని గతంలోనే సీడబ్ల్యూసీకి ఛత్తీ్‌సగఢ్‌ ఫిర్యాదు చేసింది. 2021 సెప్టెంబరులో తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌ను దాఖలు చేయగా.. ఛత్తీ్‌సగఢ్‌ అభ్యంతరాలతో ముందుకు కదల్లేదు.

Updated Date - Jun 06 , 2024 | 03:48 AM