Share News

Police Suspended: ఆరుగురు పోలీసుల సస్పెన్షన్‌

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:42 AM

దొంగతనం ఆరోపణతో దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఆరుగురిని సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

Police Suspended: ఆరుగురు పోలీసుల సస్పెన్షన్‌

  • షాద్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఐదుగురు కానిస్టేబుళ్లపై వేటు.. దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ కేసులో చర్య

  • ఆస్పత్రిలో బాధితురాలికి నేతల పరామర్శ

షాద్‌నగర్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): దొంగతనం ఆరోపణతో దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఆరుగురిని సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రామిరెడ్డి.. కానిస్టేబుళ్లు మోహన్‌లాల్‌, అఖిల, జకీర్‌, కరుణాకర్‌, రాజును సస్పెండ్‌ చేశారు. జూలై 24న షాద్‌నగర్‌లోని అంబేడ్కర్‌ కాలనీలో ఉంటున్న దళిత మహిళ సునీతను పోలీసులు అరెస్టుచేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారన్న వార్త వైరల్‌ అయింది. దీనిపై సోమవారం బీఆర్‌ఎస్‌, బీజేపీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాల నేతలు ఆందోళనలు చేశారు.


ఘటనపై డీజీపీ జితేందర్‌ ఆరా తీశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి అండ చూసుకునే పోలీసులు రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం లాఠీ పోలీస్‌ ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. షాద్‌నగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీతను సబితారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, పార్టీ నేతలు ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌ కుమార్‌, మంద జగన్నాథం తదితరులు పరామర్శించారు. అనంతరం సబిత మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉండబోదని, కేవలం లాఠీ పోలీస్‌ పద్ధతే ఉంటుందని రేవంత్‌ చెప్పిన మాటలను షాద్‌నగర్‌ పోలీసులు నిజం చేశారన్నా రు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే లైంగిక దాడులు, హత్యలు, పోలీసు దాడులు పెరిగి పోయాయని చెప్పారు. రాత్రి 8 గంటలకు మహిళను పోలీస్‌ స్టేషన్‌కు రప్పించి ఆమెపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం నేరమని ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. బాధితురాలికి రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి తక్షణ సాయంగా సునీత కుటుంబానికి రూ.లక్ష అందజేశారు. కాగా, ‘మేమూ దళితులమే. చోరీ విషయంలో మేము పెట్టిన కేసును నీరుగార్చేందుకే సునీత కుటుంబం థర్డ్‌ డిగ్రీ డ్రామాలాడుతోంది’ అని ఫిర్యాదుదారు నాగేందర్‌, ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.


  • దళిత మహిళపై ఇంత దాష్టీకమా?: కేటీఆర్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): దళిత మహిళపై పోలీసుల దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ‘‘దళిత మహిళపై ఇంత దాష్టీకమా? కాంగ్రెస్‌ నేతలు చెప్పే ఇందిరమ్మ పాలన ఇదేనా?’’అని ప్రశ్నించారు. యథా రాజా.. తథాప్రజా.. అన్నట్లుగా ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే, పోలీసులు అదే బాటలో నడుస్తూ.. వారిపై దాడులు చేస్తున్నారని ఓప్రకటనలో ఆరోపించారు. మహిళలంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని ప్రశ్నించారు. మహిళపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ‘ఎక్స్‌’లో కేటీఆర్‌ ఆరోపించారు.

Updated Date - Aug 06 , 2024 | 04:42 AM