Share News

fee reimbursement: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌..

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:10 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం రూ.వేల కోట్లు బకాయి పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

fee reimbursement: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌..

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై కాలేజీలకు సీఎం ప్రతిపాదన

  • ఇక నుంచి సకాలంలో చెల్లింపులు చేస్తాం

  • తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే ప్రధాన కారణం

  • దీన్ని పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్లే

  • ఏ పరీక్షలూ రాయనివాళ్లే వాయిదా దీక్షలు చేస్తున్నారు

  • జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి నియామకాలు చేపడతాం

  • ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల

  • సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యలు

  • వినతిపత్రాల నుంచి పోస్టింగ్‌ ఇచ్చే స్థాయికి వచ్చా

  • యువత లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకుసాగాలి

  • తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మారుద్దాం

  • కళాశాలల్లో నైతిక పోలీసింగ్‌ పాఠాలూ నేర్పాలి

  • ఎన్‌ఎస్‌ఎస్‌, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం రూ.వేల కోట్లు బకాయి పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాలేజీల యాజమాన్య ప్రతినిధులందరూ కలిసి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు ప్రతిపాదనలు ఇస్తే.. సమస్యను త్వరగా పరిష్కరించే బాధ్యతను ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగిస్తున్నానని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి పడకుండా సకాలంలో ఫీజు చెల్లింపులు చేస్తామన్నారు. శనివారం ‘క్వాలిటీ ఇంజనీరింగ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ తెలంగాణ’ అనే అంశంపై వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలతో జేఎన్‌టీయూలో నిర్వహించిన సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి పేదవాడి బిడ్డకు కార్పొరేట్‌ విద్యను అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.


ప్రపంచంలో ఏవైనా మానవ నిర్మాణ అద్భుతాలు ఉన్నాయంటే.. అందుకు కారకులు ఇంజనీర్లేనని సీఎం అన్నారు. ఇంజనీరింగ్‌ కాలేజీలు నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా ఉండొద్దని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే గొప్ప సంస్థలుగా తయారు కావాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. తాత్కాలిక ఉద్యోగాలకు అవకాశమున్న కోర్సులపైనే యాజమాన్యాలు దృష్టిపెడుతున్నాయని, దేశ నిర్మాణానికి అవసరమైన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను చాలా కళాశాలలు తగ్గించుకుంటున్నాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే కోర్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లను తప్పనిసరిగా కాలేజీల్లో నడపాలని, లేదంటే దేశం అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. గత ముఖ్యమంత్రులు చూపిన చొరవ కారణంగా తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకుపోతోందని సీఎం పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్లలో ఏ బహుళజాతి సంస్థ సీఈవో అయినా భారతీయుడే ఉంటారని తెలిపారు.


గ్రూప్‌-1కు 1ః100 చొప్పున అంటే ఇబ్బందులే..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య అని, దీనిని పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్లేనని సీఎం రేవంత్‌ అన్నారు. ఈ మేరకే నిరుద్యోగ యువకులు, విద్యార్థుల కోసం తమ ప్రభుత్వం వివిధ ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను క్లియర్‌ చేసి.. ఏకకాలంలో 19 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామన్నారు. నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్న గ్రూప్‌-1 పరీక్షను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్‌-1 పరీక్షకు బయోమెట్రిక్‌ తీసుకుంటామని నోటిఫికేషన్‌లో పేర్కొని.. తీసుకోకపోవడంతో న్యాయస్థానం కొట్టివేసిందని గుర్తు చేశారు. కానీ, తమ ప్రభుత్వం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌లో పొందుపరిచిన అంశాల ప్రకారమే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇచ్చిందని చెప్పారు. 2022లో గత ప్రభుత్వం 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపికచేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొందని, అవే మార్గదర్శకాలతో పరీక్షలు నిర్వహించాక.. కొందరు ఇప్పుడు 1:100 చొప్పున అవకాశమివ్వాలంటున్నారని సీఎం అన్నారు. అందుకు తమకేమీ ఇబ్బంది లేదని, కానీ.. కోర్టు మళ్లీ కొట్టేస్తే గ్రూప్‌-1 వ్యవహారం మొదటికి వస్తుందని పేర్కొన్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు గ్రూప్‌-1 నియామకాలు పూర్తి కాలేదని, అభ్యర్థుల యుక్తవయసు మొత్తం కోచింగ్‌ సెంటర్లలోనే గడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం..

మార్చి 31 వరకు ఉద్యోగ ఖాళీల వివరాలు సేకరించి.. జూన్‌ 2లోగా నోటిఫికేషన్‌ విడుదల చేసి.. డిసెంబర్‌ 9లోపు నియామకాలు చేపడతామని సీఎం రేవంత్‌ ప్రకటించారు. యూపీఎస్సీ సివిల్స్‌ మాదిరిగా జాబ్‌ క్యాలెండర్‌ ఉండాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గతంలో ఔట్‌సోర్సింగ్‌ వారిని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో నియమించారని, ఉద్యోగాల భర్తీ వాళ్లకు అప్పగిస్తే ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆర్‌ఎంపీ డాక్టర్‌ను టీఎ్‌సపీఎస్సీ సభ్యుడిని చేశారని, ఆయన గ్రూప్‌-1 అధికారిని ఇంటర్వ్యూ చేసి నియమించడమేంటో చెప్పాలని వ్యాఖ్యానించారు. గ్రూప్‌-1 పేపర్‌ తయారు చేసేవారు, నియమించేవారు అంతకంటే పైస్థాయి వారు అయి ఉండాలన్నారు. అంతేతప్ప.. రాజకీయ పునరావాస కేంద్రాలుగా విద్యావ్యవస్థలు మారకూడద న్నారు. తమ ప్రభుత్వం ఏర ్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించామని తెలిపారు. డీఎస్సీ, గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 తదితర అన్ని ఉద్యోగాలనూ ఈ ఏడాది ఆఖర్లోగా భర్తీ చేయాలనుకుంటున్నామని ప్రకటించారు. సెప్టెంబరులో జరగనున్న ఆర్టిషీషియల్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు సంబంధించిన ఏఐ లోగోను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కోర్‌ ఇంజనీరింగ్‌ను మరిచిపోకుండా అధునాతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ నడిబొడ్డున ఏఐ సిటీ ఏర్పాటుకు 200 ఎకరాలను సీఎం రేవంత్‌రెడ్డి కేటాయించారని, ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌ అనంతరం ఏఐ సిటీ నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు.


పరీక్షలు రాయనివాళ్లే దీక్షలు చేస్తున్నారు..

ప్రభుత్వ విధానాలు విద్యార్థుల జీవితాలపై చెడు ప్రభావం చూపకూడదని నియామక పరీక్షలు ఇబ్బంది లేకుండా నిర్వహిస్తుంటే కొందరు వాయిదా కావాలంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్‌ సెంటర్లు.. వాటి స్వలాభం కోసం పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నాయన్నారు. ఏ పరీక్షా రాయనివారు పరీక్షల వాయిదా అడుగుతున్నారని, దీక్ష చేస్తున్న ముగ్గురిలో ఒక్కరు కూడా ఏ పరీక్షా రాయడంలేదని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ‘‘ఒక కోచింగ్‌ సెంటర్‌ యజమాని పరీక్ష వాయిదా వేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నడు. ఆయన ఏ పరీక్ష రాస్తున్నడని అడిగితే.. ఆయనకు కోచింగ్‌ సెంటర్‌ ఉందని, డీఎస్సీని రెండు నెలలు వాయిదా వేస్తే రూ.100 కోట్లు లాభం వస్తుందన్నట్లు చెబుతున్నారు. మరో ఇద్దరు కూడా ఇతరత్రా రాజకీయ కారణాలతోనే దీక్షలు చేస్తున్నరు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


రిప్రజెంటేషన్ల నుంచి పోస్టింగ్‌ ఇచ్చే స్థాయికి వచ్చా: రేవంత్‌

‘నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు ప్రస్తుత సీపీ శ్రీనివా్‌సరెడ్డి మా జిల్లా ఎస్పీగా ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆయనకు రిప్రజెంటేషన్లు ఇచ్చేవాడిని. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత నేను సీఎంను అయ్యాను. అదే శ్రీనివా్‌సరెడ్డికి ఇప్పుడు నేనే పోస్టింగ్‌ ఇచ్చాను. లక్ష్యంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. అందుకు నేనే నిదర్శనం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ‘డ్రగ్స్‌ నియంత్రణ, మహిళా భద్రతలో వాలంటీర్లు’ అనే అంశంపై జేఎన్‌టీయూలో ఎన్‌ఎ్‌సఎస్‌ వాలంటీర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనపై ప్రతి ఒక్కరూ సీరియ్‌సగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని పెద్ద పెద్ద స్కూళ్లల్లో విద్యార్ధులు పుస్తకాలు పెట్టుకునేందుకు కల్పించే ర్యాక్‌ సదుపాయంలో గంజాయి చాక్లెట్లు, ఇతర మత్తు పదార్ధాలు బయట పడుతుండటం ఆందోళనకరమన్నారు.


తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉందని, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిందని అన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనలో పోలీసులతోపాటు మోరల్‌ పోలీసింగ్‌ కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కాలేజీల్లో పాఠ్యాంశాలతోపాటు మోరల్‌ పోలీసింగ్‌ నేర్పించాలని సూచించారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ఎన్‌ఎ్‌సఎస్‌ వాలంటీర్లు సహకరించాలని కోరారు. సమాజంలో పెడ ధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణమని, పిల్లలను మొబైల్‌ ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలసి సీఎం సూచించారు. తమ ప్రభుత్వం క్రీడలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించిందని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని భావిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్‌, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పోలీస్‌ కమిషనర్లు కె.శ్రీనివా్‌సరెడ్డి, అవినాష్‌ మహంతి, సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2024 | 03:10 AM