Share News

Bhatti Vikramarka: ఉద్యోగుల సమస్యలపై.. క్యాబినెట్‌ సబ్‌కమిటీ

ABN , Publish Date - Nov 09 , 2024 | 03:57 AM

ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.

Bhatti Vikramarka: ఉద్యోగుల సమస్యలపై.. క్యాబినెట్‌ సబ్‌కమిటీ

  • చైర్మన్‌గా భట్టి.. సభ్యులుగా శ్రీధర్‌బాబు, పొన్నం

హైదరాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌.. ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావును నియమించింది. సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) ముఖ్యకార్యదర్శి ఈ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సూచనలు చేయాల్సిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.


తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జేఏసీ.. పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరువు భత్యా(డీఏ)ల విడుదల, రెండో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) సిఫారసుల మేరకు వేతనాల పెంపు, సప్లిమెంటరీ బిల్లుల క్లియరెన్స్‌, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) రద్దు తదితర పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ సమస్యల పరిష్కారానికి త్వరలోనే క్యాబినెట్‌ సబ్‌ కమిటీని వేస్తామంటూ అక్టోబరు 26న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసి, సిఫారసులు చేయాల్సిందిగా ఆదేశించింది.

Updated Date - Nov 09 , 2024 | 03:57 AM