Share News

Hyderabad: తనఖా కాదు.. హామీ!

ABN , Publish Date - Jul 02 , 2024 | 03:17 AM

రైతు రుణ మాఫీ, రైతు భరోసా పథకాల కోసం ప్రభుత్వం రకరకాలుగా నిధుల వేటను సాగిస్తోంది. ప్రభుత్వ భూములను హామీగా పెట్టి ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి బాండ్ల ద్వారా నిధులను సేకరించడం, ఏడాది పొడవునా తీసుకొనే బడ్జెట్‌ అప్పులను ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.

Hyderabad: తనఖా కాదు.. హామీ!

  • ప్రభుత్వ భూముల్ని అడ్డం పెట్టి రుణాలు

  • బాండ్ల ద్వారా 10 వేల కోట్లు సేకరణ!

  • రుణ మాఫీ, రైతు భరోసా కోసం యోచన

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రైతు రుణ మాఫీ, రైతు భరోసా పథకాల కోసం ప్రభుత్వం రకరకాలుగా నిధుల వేటను సాగిస్తోంది. ప్రభుత్వ భూములను హామీగా పెట్టి ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి బాండ్ల ద్వారా నిధులను సేకరించడం, ఏడాది పొడవునా తీసుకొనే బడ్జెట్‌ అప్పులను ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వంటి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ భూములను హామీగా పెట్టి దాదాపు రూ.10 వేల కోట్లను సమీకరించే ఆలోచనలో ఉన్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం నెరపడానికి ఒక సలహాదారు సంస్థ లేదా మర్చంట్‌ బ్యాంకర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది.


సాధ్యమైనంత త్వరగా సంస్థను నియమించి, అదిచ్చే సూచనలు, సలహాల మేరకు నిధులను సేకరిస్తారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా పథకాలు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైనవిగా ఉన్నాయి. వీటిని ఎలాగైనా అమలు చేసి తీరాలన్న పట్టుదలతో ఉంది. రైతు రుణ మాఫీ పథకానికి రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. రైతు భరోసా పథకానికి కూడా అత్యవసరంగా నిధులను సర్దాల్సి ఉంది. ఇందుకోసమే భూములను హామీగా పెట్టి తక్కువ వడ్డీతో, దీర్ఘకాలిక రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూములను తనఖా(మార్ట్‌గేజ్‌) పెట్టి రుణాలు తీసుకుంటే నిర్దేశిత కాలంలోగా తిరిగి చెల్లిస్తామంటూ ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది.


హామీగా పెట్టి తీసుకునే రుణాలను తిరిగి చెల్లించే విషయంలో ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వవచ్చు, ఇవ్వకపోయినా ఇబ్బంది ఉండదని అధికారులు అంటున్నారు. ఈ వెసులుబాటును వాడుకోవడం వల్ల ప్రభుత్వంపై దీర్ఘకాలికంగా కూడా పెద్దగా భారం పడదని అంచనా వేస్తున్నారు. సలహా సంస్థ ఎంపికకు వారం రోజుల క్రితమే ప్రభుత్వం టెండర్‌ జారీ చేసింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ప్రభుత్వఆర్థిక సంస్థకు ఒకేసారి కనీసం రూ.5000 కోట్ల మేర మార్కెట్‌ రుణాలు సేకరించి పెట్టిన అనుభవం ఉండాలని టెండర్‌లో పేర్కొంది. తర్వాత ఆసక్తి చూపించిన కొన్ని సంస్థల విజ్ఞప్తి మేరకు రూ.5000 కోట్లను రూ.1500 కోట్లకు తగ్గించారు. ఎంపికైన సంస్థ ఇతర ఆర్థిక సంస్థలు, బ్యాంకులను సంప్రదించి, రుణాలు లభించేలా చేస్తుంది. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థలను పరిశీలిస్తుంది.

Updated Date - Jul 02 , 2024 | 03:17 AM