Share News

Jishnu Dev Varma: గవర్నర్‌గా రేపు జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం..

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:58 AM

తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమితులైన త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Jishnu Dev Varma: గవర్నర్‌గా రేపు జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం..

  • ఈ పదవి అస్సలు ఊహించలేదు

  • మోదీ ఫోన్‌ చేసి రాష్ట్రం విడిచి వెళ్లాలన్నారు

  • రేవంత్‌రెడ్డితెలంగాణకు స్వాగతమన్నారు

  • గవర్నర్‌గా నియమించారని అప్పుడు అర్థమైంది: జిష్ణుదేవ్‌ వర్మ

హైదరాబాద్‌/అగర్తల, జూలై 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమితులైన త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తాను బుధవారమే హైదరాబాద్‌కు వస్తానని జిష్ణుదేవ్‌ వర్మ ఆదివారం త్రిపుర రాజధాని అగర్తలలో తనను కలిసిన విలేకరులకు చెప్పారు. తెలంగాణ గవర్నర్‌గా తనను నియమిస్తారని అస్సలు ఊహించలేదన్నారు. రాష్ట్రపతి ప్రకటన వెలువడటానికి కొద్ది గంటల ముందు ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకరి తర్వాత ఒకరు ఫోన్‌ చేయడంతో తనకు విషయం తెలిసిందన్నారు.


‘‘ప్రధాని మోదీ శనివారం రాత్రి ఫోన్‌ చేశారు. త్రిపుర రాష్ట్రం బయట పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఏ బాధ్యత అప్పగించినా చేస్తానన్నాను’’ అని జిష్ణుదేవ్‌ వర్మ చెప్పారు. కాసేపటికే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ చేసి, తెలంగాణకు సుస్వాగతం అని చెప్పారన్నారు. అప్పుడే తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తున్నారని తనకు అర్థం అయ్యిందని వెల్లడించారు. త్రిపుర రాష్ట్రం నుంచి గవర్నర్‌గా నియమితులైన తొలి వ్యక్తి తానేనన్నారు. రాజ్యాంగబద్ధ పాలన జరిగేట్లు చూసే క్రమంలో ముఖ్యమంత్రితో సమన్వయంతో పని చేస్తానని చెప్పారు. తన నియామకాన్ని త్రిపుర రాష్ట్రం పట్ల ప్రధానికి ఉన్న శ్రద్ధకు నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎన్నికలు లేకున్నా తరచూ త్రిపురకు వస్తారని గుర్తు చేశారు. తెలంగాణ గవర్నర్‌గా వెళ్లినప్పటికీ, తాను పుట్టిన త్రిపురకు సాయం చేయాల్సి వస్తే ముందుంటానని చెప్పారు. జిష్ణుదేవ్‌వర్మ గత ఏడాది త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.


  • గవర్నర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

ప్రస్తుత గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం భేటీ అయ్యారు. రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో అక్కడ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సీఎం మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌, హైదరాబాద్‌ సీపీ శ్రీనివా్‌సరెడ్డి, ఇతర అధికారులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.


  • రాధాకృష్ణన్‌కు వీడ్కోలు

తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్తున్న రాధాకృష్ణన్‌కు రాజ్‌భవన్‌ అధికారులు సోమవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న గవర్నర్‌ సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. విధి నిర్వహణలో తనకు సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా రాజ్‌భవన్‌ ఆవరణలోని అమ్మవారి ఆలయంలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Jul 30 , 2024 | 03:58 AM