Share News

Venkaiah Naidu: వరద కష్టాలపై వెంకయ్య విచారం

ABN , Publish Date - Sep 03 , 2024 | 03:41 AM

తెలుగు రాష్ర్టాల్లో వరద కష్టాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Venkaiah Naidu: వరద కష్టాలపై వెంకయ్య విచారం

  • రెండు రాష్ర్టాలకూ రూ.ఐదేసి లక్షల సాయం

  • కుమారుడు, కుమార్తె రూ.ఐదేసి లక్షల సాయం

వెంకటాచలం, సెప్టెంబరు 2: తెలుగు రాష్ర్టాల్లో వరద కష్టాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుండపోత వర్షాలు, ఉధృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో వాటిల్లుతున్న నష్టం తనను తీవ్రంగా కలచి వేసినట్లు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వరద కష్టాలపై ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.


ఇప్పటికే రెండు రాష్ర్టాల సీఎంలతో తాను మాట్లాడానని, అక్కడి ప్రభుత్వ యంత్రాంగాలతో కేంద్ర అధికారులు టచ్‌లో ఉన్నారని, రెండు రాష్ర్టాలకూ ఆర్థిక సాయం అందజేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని తెలియజేశారు. తన వ్యక్తిగత పెన్షన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ సీఎం సహాయనిధికి రూ.5లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.5లక్షల చొప్పున పంపించినట్లు వెంకయ్య తెలిపారు. అలాగే, తన కుమారుడు హర్షవర్థన్‌ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్‌ తరఫున ఒక్కో రాష్ర్టానికి రూ.2.5 లక్షలు, తన కుమారై దీపావెంకట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నుంచి ఒక్కో రాష్ర్టానికి రూ.2.5లక్షల చొప్పున మొత్తం పది లక్షలు అందజేసినట్లు తెలిపారు.

Updated Date - Sep 03 , 2024 | 03:41 AM