Share News

Hyderabad: ఛత్తీ్‌సగఢ్‌తో ఒప్పందం రాష్ట్రానికి శిరోభారం..

ABN , Publish Date - Jun 20 , 2024 | 05:10 AM

తెలంగాణ భరించలేనంత స్థాయికి భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ భారం చేరిందని, ఛత్తీ్‌సగఢ్‌తో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని విద్యుత్‌ రంగ నిపుణులు వేణుగోపాల్‌, తిమ్మారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్‌పై విచారణ చేస్తున్న కమిషన్‌కు వారు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

 Hyderabad: ఛత్తీ్‌సగఢ్‌తో ఒప్పందం రాష్ట్రానికి శిరోభారం..

  • తెలంగాణ భరించలేనంతగా భద్రాద్రి ప్లాంట్‌ భారం.. విద్యుత్‌ రంగ నిపుణులు వేణుగోపాల్‌, తిమ్మారెడ్డి

  • జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌కు వివరాల అందజేత

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భరించలేనంత స్థాయికి భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ భారం చేరిందని, ఛత్తీ్‌సగఢ్‌తో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని విద్యుత్‌ రంగ నిపుణులు వేణుగోపాల్‌, తిమ్మారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్‌పై విచారణ చేస్తున్న కమిషన్‌కు వారు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అయితే వాటిపై మరిన్ని వివరాలు అందించాలని కమిషన్‌ కోరగా బుధవారం జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి ముందు హాజరై వివరాలు అందించారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. పోటీ బిడ్డింగ్‌ లేకుండా ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు.


2017లో ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ వచ్చేనాటికే భూపాలపల్లిలో కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌, 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌తోపాటు జూరాలలో జలవిద్యుత్‌ ఉత్పాదన అందుబాటులోకి వచ్చిందని తిమ్మారెడ్డి చెప్పారు. ఛత్తీ్‌సగఢ్‌తో 1,000 మెగావాట్లకు ఒప్పందం చేసుకోగా...అరకొర విద్యుత్‌ మాత్రమే చేరిందని, దీనికోసం కారిడార్‌కు రూ.630 కోట్ల దాకా చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్‌ యూనిట్‌ రూ.3.90కు రాలేదని, ఒక్క యూనిట్‌ రూ.5.40కు చేరుకుందని చెప్పారు. భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తికాక ముందే 2018 జనవరి నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారని, ఈ ప్లాంట్‌ను రూ.7.900 కోట్లతో చేపట్టగా... జెన్‌కో చేపట్టిన ఇతర పనులన్నీ కలిపి రూ.10 వేల కోట్లకు చే రిందన్నారు.


ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్‌తో కీడే: వేణుగోపాల్‌

ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్‌తో తెలంగాణకు మేలు కంటే కీడే ఎక్కువ జరిగిందని విద్యుత్‌ రంగ నిపుణుడు వేణుగోపాల్‌ చెప్పారు. 2014లో ఒప్పందం చేసుకుంటే 2017-18లో 1,000 మెగావాట్లకుగాను 75శాతం మాత్రమే చేరిందని, 2022 ఏప్రిల్‌ నుంచి చెల్లింపులు చేయని కారణంగా సరఫరా ఆగిపోయిందన్నారు. దీంతో ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్‌ స్థానంలో బహిరంగ విపణి నుంచి యూనిట్‌కు రూ.10, రూ.15, రూ.20లకు కరెంట్‌ కొనుగోలు చేశారని తెలిపారు. ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్‌ను రాష్ట్రానికి తరలించేందుకు పవర్‌ గ్రిడ్‌తో 1,000 మెగావాట్ల కారిడార్‌ బుక్‌ చేసుకున్నారని, దీన్ని వినియోగించుకోనప్పటికీ రూ.635 కోట్లకుపైగా చెల్లింపులు చేశారని, మరో 1,000 మెగావాట్ల కారిడార్‌ను బుక్‌ చేసుకొని రద్దు చేసుకున్నందుకు రూ.261 కోట్లకు పవర్‌ గ్రిడ్‌ నోటీసులు ఇచ్చిందన్నారు. రూ.3 వేల కోట్ల బిల్లులు ఛత్తీ్‌సగఢ్‌కు చెల్లించాల్సి ఉందని చెప్పారు. సకాలంలో నిర్మాణాలు కానందువల్ల యాదాద్రి, భద్రాద్రిలతో పెట్టుబడి వ్యయం భారీగా పెరగనుందన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 05:10 AM