Satyavathi Rathod : తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో రివ్యూ చేయాలి
ABN , Publish Date - Sep 01 , 2024 | 07:16 PM
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి , ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు.
మహబూబాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి , ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం, మంత్రులకు సోయిలేదని మండిపడ్డారు. నలుగురు మంత్రులు కలిసి ఇప్పటి వరకు వర్షాలపై రివ్యూ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాలకు మహబూబాబాద్ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈరోజు(ఆదివారం) సత్యవతి రాథోడ్ మహబూబూబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు లేదని అన్నారు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెస్తేనే సీఎం, మంత్రులు అయ్యారనే విషయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గుర్తుపెట్టుకోవాలని అన్నారు. భట్టి విక్రమార్క మనస్తాపం చెందినప్పుడు ఏదో ఒకటి మాట్లాడతారని విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆస్పత్రులకు రోగం వచ్చిందని సత్యవతి రాథోడ్ విమర్శించారు.
రాష్ట్రంలో విద్యాశాఖ, గిరిజన శాఖ, హోంశాఖకు మంత్రులు లేరని చెప్పారు. కేసీఆర్ ఎందుకు ప్రజల్లోకి రాకూడదో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను చూసి ప్రజలు ఓట్లు వేయలేదని.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏది చేయాలన్నా ఢిల్లీ పర్మిషన్ కావాలా అని నిలదీశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై మాట్లాడితే రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందని సత్యవతి రాథోడ్ అన్నారు.