Year-Ender 2024: ఈ ఏడాది దేశంలో సంచలనం సృష్టించిన నేరాలివే..
ABN , Publish Date - Dec 31 , 2024 | 10:04 PM
నేరాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక కేసు వెలుగులోకి రావడం చూస్తున్నాం. కొన్ని నేరాలు దేశాన్నే అతాకుతలం చేసిన ఘటనలను కూడా చూశాం. కోల్‌కతా అత్యాచార ఘటన సహా అనేక కేసులు ప్రజలు దిగ్భ్రాంతికి గురి చేశాయి. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా..
నేరాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక కేసు వెలుగులోకి రావడం చూస్తున్నాం. కొన్ని నేరాలు దేశాన్నే అతాకుతలం చేసిన ఘటనలను కూడా చూశాం. కోల్‌కతా అత్యాచార ఘటన సహా అనేక కేసులు ప్రజలు దిగ్భ్రాంతికి గురి చేశాయి. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా.. ఈ ఏడాది దేశంలో సంచలనం సృష్టించిన అతి పెద్ద నేరాల గురించి ఓ లుక్కేద్దాం పదండి..
ఈ ఏడాది దేశంలో జరిగిన అనేక నేరాల్లో కొన్ని కేసులు మాత్రం ప్రజలను షాక్‌కు గురి చేశాయి. కోల్‌కతా అత్యాచార ఘటన యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలంటూ జూనియర్ డాక్టర్లు 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఈ కేసులో పోలీస్ వాలంటీర్‌గా పని చేస్తున్న 33 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ఇద్దరు కీలక నిందితులకు బెయిల్ లభించింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు.
కొడుకును చంపిన తల్లి
బెంగళూరుకు చెందిన ఓ ల్యాబ్ వ్యవస్థాపకుడైన 39 ఏళ్ల సుచనా సేథ్.. గోవాలోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో జనవరి 6న తన కొడుకును హత్య చేసింది. ఆపై ఓ బ్యాగ్‌లో శవాన్ని కుక్కి అద్దె వాహనంలో బెంగళూరుకు వచ్చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ప్రయాణించిన టాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్తతో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కొడుకును ఇలా దారుణంగా హత్య చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
మాజీ ఎంపీపై లైంగిక వేధింపుల కేసు
మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు, జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సెప్టెంబర్‌లో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తన తల్లిని ప్రజ్వల్ ఎత్తుకుపోయారని.. ఆయన ఫామ్ హౌస్‌లో పని చేసే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైంది. దీనికితోడు చాలా మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
నేహా హిరేమఠ్ హత్య
కర్నాటకలోని హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె అయిన 23 ఏళ్ల హిరేమఠ హత్య కేసు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఫయాజ్ అనే నిందితుడు కాలేజీ క్యాంపస్‌లో హిరేమఠ్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన చివరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా దారి తీసింది. ఈ హత్యను ‘‘లవ్ జిహాద్’’.. అంటూ బీజేపీ ఆరోపించింది. అలాగే ఏబీవీపీ, హిందూ సంఘాల నేతలంతా విద్యార్థులతో కలిసి రాష్ట్ర హోమంత్రి ఇంటి ముందు నిరసనలు కూడా చేపట్టారు. చివరకు ఏకంగా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ సహా అనేక దేశాల్లో ప్రవాస భారతీయులు నిరసనలు చేపట్టారు.
పూణె పోర్షే కారు ప్రమాదం
పూణె పోర్షే కారు ప్రమాదం వేశంలో సంచలనం సృష్టించింది. మే 19న పూణే కళ్యాణి నగర్‌లో ఆదివారం తెల్లవారు జామున పోర్షే కారు ఇద్దరు ఇంజినీర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే చనిపోయారు. ఆ కారును మైనర్ నడిపినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఆ బాలుడు ప్రముఖ రియల్టర్ విశాల్ అగర్వాల్ కొడుకున అని తెలిసింది. అయితే తర్వాత ఈ కేసు అనేక మలుపులు తీసుకుంది. తమ కొడుకు కారు నడపలేదని చూపించే ప్రయత్నాలు చేశారు. ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం విమర్శలకు దారి తీసింది.
రియాసీలో ఉగ్రదాడి
జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో జూన్ 9న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 33 మంది గాయపడ్డారు. ఈ కేసు అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది.
బద్లాపూర్ స్కూల్ కేసు
మహారాష్ట్రలోని బద్లాపూర్ జిల్లా ఓ ప్రముఖ పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై స్వీపర్ లైంగిక దాడులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆగస్టు 17న నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై అప్పట్లో సదరు జిల్లాతో పాటూ అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి నిరనసలు వెల్లువెత్తాయి.
అధికారులపై దాడి
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ జిల్లా మహూ పట్టణంలో సెప్టెంబర్ 11న రాత్రి ఇద్దరు యువ ఆర్మీ ఆఫీసర్లపై దుండగులు దాది చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వారి వద్ద నగదు దోచుకోవడంతో పాటూ వారి స్నేహితురాలిపై కూడా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారుల్లో ఒకరిని, ఒక మహిళను అదుపులోకి తీసుకుని మిగతా వారిని రూ.10లక్షలకు తీసుకురావాలని పంపించారు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
బాబా సిద్ధిఖీ హత్య
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో అక్టోబర్ 12న బాబా సిద్ధిఖీపై కాల్పలు జరిపిన విషయం తెలిసిందే. ఈ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ హస్తం ఉందని తెలిసింది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సిద్ధిఖీకి ఉన్న సంబంధాలు, నటుడు సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా మెలగడంవల్లే ఈ హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మొత్తం 21 మందిని అరెస్ట్ చేశారు.
మణిపూర్ మరణాలు
మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు తగ్గుతున్న సమయంలో సెప్టెంబర్‌లో జరిగిన హింసాకాండలో ఆరుగురు మృతి చెందారు. రాకెడ్ దాడిలో బిష్ణుపూర్ జిల్లాలోని ఓ వృద్ధుడు మరణించిన మరుసటి రోజే ఈ హింస చెలరేగింది. అయితే సాయుధ గ్రూపులు తమను తాము ‘‘విలేజ్ డిఫెన్స్ వాలంటీర్లు’’ గా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.