Share News

Health Tips : మెమొరీ పవర్ పెరగాలంటే.. ఇది ఫాలో అవ్వండి..

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:39 PM

అరె ఈ వస్తువు ఇప్పుడే కదా ఇక్కడ పెట్టాను ఎక్కడుందబ్బా అనుకుంటున్నారా.. బాగా తెలిసిన వాళ్లు ఎదురుపడినా పేరు జ్ఞాపకం రావడం లేదా.. ముఖ్యమైన విషయాలూ తరచూ మర్చిపోతుంటే.. మెమొరీ పవర్ పెరిగేందుకు ఇలా చేయండి..

Health Tips : మెమొరీ పవర్ పెరగాలంటే.. ఇది ఫాలో అవ్వండి..
Expert Tips To Boost Your Memory

అరె ఈ వస్తువు ఇప్పుడే కదా ఇక్కడ పెట్టాను ఎక్కడుందబ్బా అని వెతకడం అందరూ చేసేదే. ఇది అప్పుడప్పుడు అయితే ఏ సమస్యా ఉండదు. తరచూ ఇలాగే చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటే కాస్త ఆలోచించాల్సిందే. వృద్ధాప్యంలో ఉన్నవారు జ్ఞాపకశక్తి కోల్పోవడం అనేది చాలా సాధారణం. కానీ, నేటి కాలంలో చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వాళ్లూ మతిమరుపు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంట్లో వస్తువులు ఎక్కడ ఏదీ పెట్టారో గుర్తుండదు. బాగా తెలిసిన స్నేహితులు, బంధువులు ఎదురుపడితే పేరు జ్ఞాపకం రాక మాట తడబడిపోతుంది. మీ పెళ్లిరోజు లేదా పుట్టినరోజు ఎప్పుడని ఎవరైనా అడిగితే ఠక్కున చెప్పలేక తటపటాయిస్తారు. ఎన్నో సార్లు చూసిన ఇష్టమైన సినిమాలోని హీరో పేరు కొన్నిసార్లు ఎంత ఆలోచించినా గుర్తురాక ఇబ్బందిపడతారు. ఇలాంటి సందర్భాలు జీవితంలో ఎప్పుడోకసారి ఎదురైతే మామూలే అని వదిలేయవచ్చు. గంట క్రితం జరిగిన దానిని కూడా మర్చిపోతున్నారంటే అందుకు ఇదే కారణమంటున్నారు మానసిక నిపుణులు. మతిమరపు వచ్చిందని ఆందోళ చెందకుండా..మెమోరీ లాస్ నుంచి బయటపడేందుకు ఇలా చేయాలని సూచిస్తున్నారు.


మతిమరుపు ఎందుకు వస్తుంది?

చాలా సార్లు మతిమరుపు రావడానికి కారణం వృత్తిపరమైన ఒత్తిడి లేదా ఆందోళన. సరైన విశ్రాంతి, ఆహారం తీసుకోకపోవడం, మెదడు నిర్విరామంగా పనిచేయడం, అతిగా ఆలోచించడం వంటివి మతిమరుపు వచ్చేందుకు దారితీస్తాయి. సైకియాట్రిస్టుల భాషలో దీన్ని 'ఫర్గెట్ ఫ్లూ' అని పిలుస్తారు. చిన్న విషయాలతో మొదలై క్రమంగా తీవ్రత పెరిగి ముఖ్యమైన విషయాలు మర్చిపోయే పరిస్థితి రావచ్చు. అందుకే ముందే సీరియస్‌గా తీసుకుని ఈ విషయంలో జాగ్రత్తపడాలి.


ఎలా వదిలించుకోవాలి?

వైద్యుల అభిప్రాయం ప్రకారం, మీరు మతిమరుపు సమస్యల నుంచి బయటపడాలంటే మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మెదడుకు పదును పెట్టేందుకు పజిల్స్, సుడోకులు వంటివి సాల్వ్ చేయడం. మెమోరీ గేమ్స్ ఆడటం. ఒత్తిడిని పక్కన పెట్టి పోషకాహారం తీసుకోవడంతో శ్రద్ధ చూపించాలి. కంటినిండా నిద్రపోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు రోజు కాసేపు ధ్యానం, వ్యాయామం చేయాలి.


ఈ ఆహారంతో మతిమరుపు పరార్..

బాదంపప్పు : బాదంపప్పులో విటమిన్ B6, విటమిన్ Eలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. బాదంలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా ఆకలిని నియంత్రణలోకి వస్తుంది. ఇవి తింటే స్థూలకాయం కూడా రాదు.

అవిసె, గుమ్మడి గింజలు : అవిసె, గుమ్మడి గింజల్లో విటమిన్ కె, ఎ, సి, బి6, ఐరన్, జింక్ వంటివి అధికం. ఇవి తరచూ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.

Updated Date - Jan 08 , 2025 | 01:39 PM