YSRCP vs Pilli bose: ఎన్నికలకు ముందు జగన్‌కు బిగ్ ఝలక్.. పార్టీ మారే యోచనలో ఎంపీ?

ABN , First Publish Date - 2023-07-25T15:21:40+05:30 IST

వానాకాలంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార పార్టీలో కుమ్ములాటలు బజారున పడ్డాయి. గత కొద్ది రోజులుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్-ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య తలెత్తిన విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి.

YSRCP vs Pilli bose: ఎన్నికలకు ముందు జగన్‌కు బిగ్ ఝలక్.. పార్టీ మారే యోచనలో ఎంపీ?

వానాకాలంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార పార్టీలో కుమ్ములాటలు బజారున పడ్డాయి. గత కొద్ది రోజులుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్-ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (pilli subhash chandra bose) మధ్య తలెత్తిన విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి. బహిరంగంగానే మీడియా ఎదుట ఒకరి మీద ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల ఈ పంచాయితీ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు చేరింది. అక్కడ స్వయంగా ముఖ్యమంత్రి జగనే (CM JAGAN) జోక్యం పుచ్చుకుని నచ్చజెప్పినా ఏ మాత్రం సద్దుమణగకపోగా ప్రస్తుతం మరింత హాట్ హాట్‌గా నడుస్తోంది. మంత్రి-ఎంపీ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కేడర్‌ను అయోమయంలో పడేయడమే కాకుండా అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

మరోసారి హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఎంపీ బోస్, ఆయన తనయుడు తాడేపల్లికి చేరుకున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అవుతారని భావించారు. కానీ చివరి నిమిషంలో తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జ్ మిథున్‌రెడ్డితో తండ్రీకొడుకులిద్దరూ సమావేశం అయ్యారు. ఈ భేటీలో మిథున్‌రెడ్డి.. బోస్ తీరును తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది. సీనియర్ లీడర్ అధిష్టానాన్ని ధిక్కరించేలా వ్యవహారించొద్దంటూ సూచించినట్లు సమాచారం. కానీ బోస్ మాత్రం ఆయన వ్యాఖ్యలు పట్టించుకోనట్లు తెలుస్తోంది. మంత్రి వేణుకు (chelluboyina srinivasa venugopalakrishna) రామచంద్రపురం టికెట్ ఇస్తే మాత్రం పార్టీ వీడడం తప్పదని హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఎంత పెద్ద వారు చెప్పినా వినబోనని బోస్ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. తన కుటుంబానికే రామచంద్రాపురం టికెట్ ఇవ్వాలని.. లేదంటే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారని సమాచారం. మంత్రి వేణుతో సిట్టింగ్ ఏర్పాటు చేస్తానని మిథున్‌రెడ్డి అనగానే అలా కుదరదని బోస్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారంట. ఇందుకోసం మిథున్‌రెడ్డి ఎంత బుజ్జగించినా బోస్ ససేమిరా అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వేణు కింద పని చేసే వాళ్లు ఎవరూ లేరంటూ మిథున్‌రెడ్డి ముందు బోస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇక తాజా పరిణామాలు చూస్తుంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ తిరుగుబావుటా ఎగరవేయడం ఖాయమనిపిస్తోంది? జగన్ గుండెల్లో ఉన్నారని పైకి చెబుతున్నా వైసీపీకి మాత్రం గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది? ప్రస్తుత కామెంట్లు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అధిష్టానం దూతలు ఓ వైపు చర్చలు జరుపుతున్నా? ఏ మాత్రం పిల్లి మెత్తబడడం లేదు. దీంతో ఆయన పార్టీ వీడడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ నుంచి గానీ.. జనసేన నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు వైసీపీ స్థాపన నుంచి ఉన్న సీనియర్ నేత కావడం.. అంతేకాకుండా మంత్రి పదవి కూడా విడిచిపెట్టి జగన్ దగ్గరకు రావడంతో పిల్లిని విడిచిపెట్టుకోవడం అధిష్టానం కూడా అంత సముఖంగా లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-07-25T15:21:40+05:30 IST