Indian Army: ముగ్గురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు.. ప్రతీకారానికి సిద్ధమైన ఆర్మీ

ABN , First Publish Date - 2023-09-14T13:15:57+05:30 IST

ఇండియన్ ఆర్మీ ప్రతీకారానికి సిద్ధమైంది. తమ ముగ్గురు జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు వారిని ఏ క్షణంలోనైనా అంతమొందించే అవకాశాలున్నాయి.

Indian Army: ముగ్గురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు.. ప్రతీకారానికి సిద్ధమైన ఆర్మీ

జమ్మూకశ్మీర్: ఇండియన్ ఆర్మీ ప్రతీకారానికి సిద్ధమైంది. తమ ముగ్గురు జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు వారిని ఏ క్షణంలోనైనా అంతమొందించే అవకాశాలున్నాయి. బుధవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గల కోకెర్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ అధికారులు, ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) మరణించారు. చనిపోయిన అధికారులు కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనాక్, డీఎస్పీ హుమాయున్ భట్‌లుగా గుర్తించారు. 19 రాష్ట్రీయ రైఫిల్స్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్న కల్నల్ సింగ్ అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మేజర్ ధోనాక్, డీఎస్పీ భట్ చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ దాడికి లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఆఫ్‌షూట్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో తమ అనుభవజ్ఞుడైన నాయకుడిని చంపినందుకు ప్రతీకార చర్యగా ఈ దాడి చేసినట్లు లష్కరే తోయిబా ఓ ప్రకటనలో పేర్కొంది.


కాగా ఖాసీం అలియాస్ రియాజ్ అహ్మద్‌ను సెప్టెంబర్ 8న పీవోకేలోని రావలకోట్ ప్రాంతంలోని అల్-ఖుదుస్ మసీదులో ఇండియన్ ఆర్మీ అత్యంత సమీపం నుంచి కాల్చి చంపింది. దీంతో అతని మరణం అనుచరులకు కోపం తెప్పించింది, ఇది కోకెర్‌నాగ్‌లో ప్రతీకార దాడికి దారితీసింది. అహ్మద్ తండ్రి కూడా ఒక ఉగ్రవాదినే. అతడు 2005లో హతమయ్యాడు. కాగా బుధవారం ఉగ్రవాదులు భారత ఆర్మీపై దాడి చేసి ముగ్గురు అధికారులను చంపేశారు. ఆ మరుసటి రోజే ప్రతీకారం తీర్చుకునేందుకు భారత ఆర్మీ అనంతనాగ్‌లో ఈ రోజు కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు గురువారం తెలిపారు. ఉగ్రవాదుల్లో ఒకరిని ఉజైర్ ఖాన్‌గా గుర్తించారు. దీంతో ఆ క్షణమైన వారిని భారత ఆర్మీ అంతమొందించే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-09-14T13:15:57+05:30 IST