Share News

Modi-Shami: మోదీ రాకతోనే ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన షమీ

ABN , Publish Date - Dec 14 , 2023 | 02:13 PM

సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. అద్భుత ఆట తీరుతో ఫైనల్ చేరిన టీమిండియా తుది మెట్టుపై మాత్రం బోల్తాపడింది. ఫైనల్ పోరులో ఓడి రన్నరఫ్‌తోనే సరిపెట్టుకుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లతోపాటు కోట్లాది మంది అభిమానుల గుండెలు పగిలాయి.

Modi-Shami: మోదీ రాకతోనే ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన షమీ

సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. అద్భుత ఆట తీరుతో ఫైనల్ చేరిన టీమిండియా తుది మెట్టుపై మాత్రం బోల్తాపడింది. ఫైనల్ పోరులో ఓడి రన్నరఫ్‌తోనే సరిపెట్టుకుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లతోపాటు కోట్లాది మంది అభిమానుల గుండెలు పగిలాయి. ఆ రోజు యావత్తు భారతదేశం తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది. ఓటమి తర్వాత చెమ్మగిల్లిన కళ్లతో భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంకు చేరుకున్నారు. చాలాసేపు ఒకరితోఒకరు మాట్లాడుకోలేదు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా భారత ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆటగాళ్లను ఓదార్చారు. వారికి మంచి మాటలు చెప్పి ప్రేరణ కల్గించారు. ఆ రోజు జరిగిన ఈ ఘటన గురించి తాజాగా టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో నాటి ఘటన గురించి వివరించాడు. ప్రధాని మాటలు తమకు ఎంతగానే ప్రేరణ కల్గించాయని పేర్కొన్నాడు.


‘‘ఓటమి అనంతరం మేమంతా తీవ్ర దు:ఖంలో మునిగిపోయాం. రెండు నెలలపాటు పడిన శ్రమ ఒక మ్యాచ్‌తో పోయింది. ఆ రోజు మాకు ఏదీ కలిసిరాలేదు. తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాం. కానీ ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూంలోకి రావడంతో మేమంతా ఆశ్చర్యానికి గురయ్యాం. ఒక్కసారిగా తలెత్తి ఆయనను చూశాం. మోదీ అక్కడికి వస్తున్నారన్న ముందస్తు సమాచారం కూడా మాకు లేదు. ఆయన హఠాత్తుగా లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో మేము ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేము. తినాలనిపించలేదు. కానీ ప్రధానిని చూశాక ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగింది. ఆయన మా దగ్గరకు వచ్చి మాట్లాడారు. ప్రతి ఒక్కరితో మాట్లాడారు. బాగా ఆడారని ధైర్యం చెప్పారు. ఆ తర్వాతి నుంచే మేము ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం. మనం ఈ ఓటమి బాధను తట్టుకుని ముందుకు సాగాలని చెప్పారు. ప్రధాని పరామర్శ మాకు ఎంతో ఉపయోగపడింది.’’ అని షమీ చెప్పాడు. కాగా డ్రెస్టింగ్ రూంలో షమీని మోదీ ఓదార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

Updated Date - Dec 14 , 2023 | 02:13 PM