CM KCR: దేశం అబ్బురపడేలా పే స్కేలు!

ABN , First Publish Date - 2023-08-07T02:27:12+05:30 IST

అతి త్వరలోనే వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు. ఆలోపు మధ్యంతర భృతి (ఐఆర్‌)పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

CM KCR: దేశం అబ్బురపడేలా పే స్కేలు!

ఆర్థిక వనరులు సమకూరగానే ఇస్తాం.. త్వరలోనే పీఆర్సీ.. ఆలోగా ఐఆర్‌పై నిర్ణయం

సింగరేణి ఉద్యోగులకు రూ.1000 కోట్ల దసరా బోనస్‌

చాలా అస్త్రాలున్నాయి.. అవసరమైనప్పుడు తీస్తాం

మునుపటి కన్నా 7-8 సీట్లు ఎక్కువే గెలుస్తాం

ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు

ప్రేమతో కాదు అనివార్యతతోనే తెలంగాణ ఇచ్చారు

శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీపై ధ్వజమెత్తిన కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): అతి త్వరలోనే వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌(CM KCR) శాసనసభలో ప్రకటించారు. ఆలోపు మధ్యంతర భృతి (ఐఆర్‌)పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక వనరులు సమకూరగానే దేశం ఆశ్చర్యపోయేలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేలు(Pay Scale for State Govt Employees) ఇస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలు అందుకుంటున్నారని గుర్తుచేశారు. ఉద్యోగస్తులంతా తమ పిల్లలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం శాసనసభలో ‘తెలంగాణ సాధన- సాధించిన ప్రగతి’పై జరిగిన లఘుచర్చలో ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగుల(Singareni employees)కు దసరా కానుకగా రూ.1000 కోట్ల బోనస్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసరా పింఛన్లను కూడా అవసరాన్ని బట్టి పెంచుతామని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఇటీవల ఖమ్మం సభలో పెన్షన్లు రూ.4 వేలు ఇస్తామందని, వారు 4 వేలు ఇస్తే మేం రూ.5 వేలు అనలేమా? అని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టో(Election Manifesto)లో గంపెడు అస్త్రాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తామని చెప్పారు. అవసరమైతే పెన్షన్లు పెంచుతామని, తాము చేయగలిందే చెబుతామని అన్నారు. కాళేశ్వరం(Kaleswaram)పై కాంగ్రెస్‌(Congress) అడ్డగోలుగా మాట్లాడుతోందని కేసీఆర్‌ మండిపడ్డారు. ‘తెలంగాణ (Telangana) రాష్ట్రం తెచ్చి, భుజాన వేసుకొని అభివృద్ధి చేసినందుకే నాకు పిండ ప్రదానం చేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు.

ప్రజలే తగిన తీర్పు చెబుతారు’ అంటూ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం లేకపోతే తుంగతుర్తికి నీళ్లు వచ్చేవా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నుంచి కోదాడ దాకా నీళ్లు పారుతున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు చలవేనన్నారు. రైతుల బతుకు విలువ కాంగ్రె్‌సకు తెలియదని.. కాళేశ్వరం వల్లే గోదావరి సజీవంగా మారిందని చెప్పారు. 250 కిలోమీటర్ల పొడవున్న గోదావరిలో 9 ఏళ్ల క్రితం వరకు దుమ్ము రేగితే నేడు 100 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయన్నారు. కాళేశ్వరంపై ఓ వెకిలి, పిచ్చి పేపరు వాడు రాస్తాడని, నిలువెల్లా విషం చిమ్ముతున్నారని మీడియాపై తన అక్కసు వెళ్లగక్కారు. కాళేశ్వరం దండగ అని మన రాష్ట్రం కాని వాడు చెబుతాడని పరోక్షంగా జేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా కాళేశ్వరమేనన్నారు. ఎస్పారెస్పీని నీల్గబెట్టింది బంగారు కాంగ్రెస్సేనని.. ప్రస్తుతం ఎస్పారెస్పీకీ కాళేశ్వరం నీళ్లతో పునరుజ్జీవం తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ ప్రాంతంలో 68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండితే ప్రస్తుతం 3 కోట్ల టన్నుల దిగుబడులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ వస్తే రైతుబంద్‌కు రాంరాం, కరెంట్‌ గోల్‌మాల్‌, దళితబంధు బంద్‌ అవుతుందని చెప్పారు. పస్తుతం భూ రికార్డులను మార్చడం సీఎం చేత కూడా కాదని చెప్పారు.


మునుపటికన్నా ఎక్కువ సీట్లు గెలుస్తాం

‘రానున్న ఎన్నికల్లో మునుపటి కన్నా 7-8 సీట్లు ఎక్కువే గెలుస్తాం’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణపై ప్రేమతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వలేదని, అనివార్యతతో ఇచ్చిందని కేసీఆర్‌ అన్నారు. ‘వైఎస్‌ చనిపోయాక జగన్‌ను కాంగ్రెస్‌ రాంగ్‌గా హ్యాండిల్‌ చేసింది. ఆ కారణంతో కాంగ్రెస్‌ పార్టీపై విశ్వాసం సన్నగిల్లింది. ఏపీలో గెలిచే అవకాశాల్లేవని.. తెలంగాణలోనైనా పది సీట్లు రాకపోతాయా అన్న కారణంతోనే తెలంగాణ ఇచ్చారు’ అని చెప్పారు. తెలంగాణను ఊడగొట్టిందే నెహ్రూ అని, అందరూ వ్యతిరేకించినా ఏపీతో కలిపారని ఆరోపించారు. 41 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను గాయపర్చిందన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో దేశంలోనే అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఎదిగిందన్నారు. కరోనా, నోట్ల రద్దు జరగకపోతే ఎంతో ముందుకు వెళ్లేవారమన్నారు. రైతుబంధును ఎవరూ ఆలోచించలేదని, ఇప్పుడు దేశానికే దిక్సూచిగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 7778 మెగావాట్ల విద్యుత్తు స్థాపిత సామర్థ్యం ఉంటే.. ప్రస్తుతం 18756 మెగావాట్లకు చేరిందని, మరో నాలుగైదు నెలల్లో 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన అలా్ట్ర మెగా పవర్‌ ప్లాంట్‌ అందుబాటులోకి రానుందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనే పుణ్యాత్ముడు.. అధికారంలోకి వస్తే ఆ థర్మల్‌ కేంద్రాన్ని మూసివేస్తామన్నారని, కాంగ్రెస్‌ నేతల నోటికి మొక్కాలని ఎద్దేవా చేశారు. ‘చట్టాన్ని గౌరవించరు. ఊరూరా తిరుగుతారు. నెల రోజుల్లో ప్రభుత్వాన్ని కూలగొడతామంటారు’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘రైల్వే స్టేషన్లలో లిఫ్టులను కూడా జాతికి అంకితం చేస్తారు. వందేభారత్‌ రైళ్లను వందసార్లు జెండాలు ఊపి ప్రారంభిస్తారు. ఇక 1600 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్‌ను కూడా జాతికి అంకితం చేయడానికి ప్రధాని వస్తారు’ అని వ్యంగ్యంగా అన్నారు. దేశంలో 100కు 100 శాతం నల్లా కనెక్షన్లు కలిగిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రతి ఇంటికీ 20 వేల లీటర్ల నీటిని ఇస్తున్నామని చెప్పారు. మిషన్‌ భగీరథపై 13 రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేశారన్నారు. 2.5 లక్షల చదరపు కిలోమీటర్ల పైప్‌లైన్‌లు వేశామని, ఈ పైపులను 5 సార్లు భూమి చుట్టూ తిప్పి కట్టొచ్చని చెప్పారు.


ఆ భూములు వందేళ్లయినా అటవీ శాఖవే

వందేళ్లయినా పోడు భూములపై గిరిజనులకు అధికారం రాదని, ఆ భూములపై అధికారం అటవీ శాఖదేనని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ పక్ష నేత భట్టివిక్రమార్క మాట్లాడగా.. సీఎం పైవిధంగా స్పందించారు. అటవీ హక్కుల రక్షణ చట్టం ప్రకారం పట్టాలు పొందే వారు, అటవీ ఉత్పత్తులను మాత్రమే పండించడానికి అవకాశం ఉంటుందని, అటవీ హక్కుల రక్షణ చట్టం ప్రకారం సర్టిఫికెట్లు పొందినవారికి పాస్‌పుస్తకాలు రావాలని అన్నారు. అయినా గిరిజనులపై దయదలిచి కరెంట్‌ లైన్లు వేసి, రైతుబంధు ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో అడవులు మాయం అయ్యాయన్నారు. 9 ఏళ్లలో హరితహారం ద్వారా 7.5 గ్రీనరీని పెంచుకున్నామని వెల్లడించారు. దళితబంధును మరో ఐదారు మండలాల్లో శాచురేషన్‌ మోడల్‌లో తీసుకుంటామని సీఎం ప్రకటించారు. మైనారిటీలు, బ్రహ్మణులకూ సాయం చేస్తామని, ఓట్ల కోసం తాము భయపడబోమని స్పష్టం చేశారు. నియామక పరీక్షలు దశల వారీగా నిర్వహిస్తామన్నారు.


గవర్నర్‌కు జ్ఞానోదయం అయింది

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు విషయంలో రాష్ట్ర గవర్నర్‌ తెలిసోతెలియకో వివాదంలో చిక్కుకున్నారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దానిపై ఆమె 96 క్లారిఫికేషన్లు అడిగారన్నారు. ఈ విషయంలో ఆమె ఎందుకు పట్టుబట్టిందో తెలియదని.. చివరికి జ్ఞానోదయమై సంతకం చేసిందని చెప్పారు. పెరుగుతున్న డీజిల్‌ ధరల వల్ల రోజూ ఆర్టీసీకి రూ.2.5 కోట్ల నష్టం వస్తోందన్నారు. నాడు వద్దన్న వాళ్లే ఇప్పుడు ఎలా విలీనం చేసుకుంటున్నారని కొందరు పిచ్చివాగుడు వాగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారని చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనం వల్ల 43 వేల మంది ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కలుగుతుందని చెప్పారు.


కేసీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు..

నగరంలో వరదలొస్తే నాడొక నాయకుడు బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తామన్నాడని.. ఇప్పుడు ఆ బండీ లేదు గుండూ లేదని పరోక్షంగా రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు. గతంలో యూరియా కొరత ఉండేదని, ఇప్పుడు పుష్కలంగా దొరుకుతుందని, తింటానంటే కాంగ్రెస్‌ నేతలకు పంపుతామని వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్‌ మాట్లాడుతున్న సమయంలో కొద్ది సేపు కాంగ్రెస్‌ నేతలు బయటకు వెళ్లడంతో ఉన్న ఇద్దరూ బయటకుపోయారని, రేపటి రోజున ప్రజలు వారిని తప్పకుండా గెంటేస్తారని చురకలంటించారు. తాము బీజేపీకి బీ టీమ్‌ అని శరద్‌ పవార్‌ అన్నారని, తీరా ఆయనే కమలం పార్టీలో చేరాడని ఎద్దేవా చేశారు. తమది పూర్తిగా సెక్యులర్‌ పార్టీ అన్నారు. ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీ అని, భవిష్యత్‌లోనూ తమ స్నేహం కొనసాగుతుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-07T04:29:45+05:30 IST