Share News

Anakapalli : హంతకుడి కోసం ముమ్మర గాలింపు

ABN , Publish Date - Jul 08 , 2024 | 04:28 AM

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను శనివారం దారుణంగా హత్య చేసిన నిందితుడు బోడా బత్తుల సురేశ్‌ (26) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Anakapalli : హంతకుడి కోసం ముమ్మర గాలింపు

  • 20కి పైగా ప్రత్యేక బృందాల ఏర్పాటు

  • బాలిక హత్య కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు

పరవాడ, జూలై 7: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను శనివారం దారుణంగా హత్య చేసిన నిందితుడు బోడా బత్తుల సురేశ్‌ (26) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు అనకాపల్లి స్పెషల్‌ బ్రాంచి, పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ పర్యవేక్షణలో 20కి పైగా బృందాలతో బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో గాలిస్తున్నారు. సురేశ్‌ స్వస్థలం అనకాపల్లి కోట్నివీధి.

చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అమ్మమ్మగారి ఊరైన కొప్పుగొండుపాలెంలోనే ఎక్కువగా ఉండేవాడు. ఐటీఐ పూర్తిచేసి, కొంతకాలం ఖాళీగా ఉన్నాడు. నిందితుడి మనస్తత్వం డిఫరెంట్‌గా ఉండేదని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి అన్న స్టిక్కరింగ్‌ షాపు పెట్టుకుని జీవిస్తుండగా, తండ్రి ఈశ్వరరావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో సురేశ్‌ చెడు అలవాట్లకు బానిసైనట్టు సమాచారం. కొంతకాలం ఫార్మాసిటీలోని ఓ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేశాడు.

దీంతో పోలీసులు ఆ కంపెనీకి వెళ్లి వివరాలు సేకరించినట్టు తెలిసింది. అమ్మమ్మగారి ఊరు కొప్పుగొండుపాలేనికి తరచూ వెళుతుండే క్రమంలోనే హత్యకు గురైన బాలిక అతని కంట పడింది. స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో సురేశ్‌ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపగా ఇటీవల బెయిల్‌పై వచ్చాడు. తనను జైలుకు పంపిన బాలికను హతమార్చాలనే ఉద్దేశంతో ప్రణాళిక ప్రకారం కత్తితో ఆమెను గొంతుకోసి హతమార్చాడు. నిందితుడి జేబులో స్వయంగా రాసి పెట్టుకున్న సూసైడ్‌ నోట్‌ కూడా ఉన్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. డీఎస్పీ కేవీ సత్యనారాయణ ఎప్పటికప్పుడు బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కొప్పుగొండుపాలెం గ్రామస్థులు కూడా నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 04:28 AM