AP Election Results: నిడదవోలులో గెలుపు వారిదేనా?
ABN , Publish Date - May 24 , 2024 | 01:21 AM
నిడదవోలు అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిదనే దానిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నాయకులు గెలుపు తమదంటే ఉమ్మడి అభ్యర్థిగా వచ్చిన గెలుపు మాదేనని ఉమ్మడి పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పెరవలి, మే 24 : నిడదవోలు అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిదనే దానిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నాయకులు గెలుపు తమదంటే ఉమ్మడి అభ్యర్థిగా వచ్చిన గెలుపు మాదేనని ఉమ్మడి పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉన్నప్పటికీ గెలుపుపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లును బట్టి అంచనాలు వేస్తున్నారు. ముఖ్యం గా ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఓటేయడం తమకు కలిసి వచ్చే అంశమని ఇరుపార్టీలు అభ్యర్థి తరపున నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తు న్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీతోపాటు టీడీపీ, బీజేపీ, జనసేన కూడా రంగంలో నిలిచి పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 81,001 ఓట్లు 48.19 శాతం రావడంతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుకు 59,313 ఓట్లతో 35.29 శాతం ఓట్లు సాధించారు. జనసేన తరపున పోటీ చేసిన అతికాల రమ్యశ్రీ 23,073 ఓట్లు సాధించి 23.73 శాతం ఓట్లు పొందారు. బీజేపీ తరపున పోటీ చేసిన లింగంపల్లి వెంకటేశ్వరరావు వెయ్యి 12 ఓట్లు సాధించారు. 0.6 శాతం సాధించారు. ప్రస్తుతం ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్‌కు మద్దతు ఇచ్చాయి. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో మూడు పార్టీలకు వచ్చిన ఓట్లను కలిిపితే 83 వేల 398 ఓట్లు వచ్చాయని ఈ ఓట్లు శ్రీనివాసనాయుడుకు వచ్చిన ఓట్లు కంటే 2వేల 397 ఓట్లు అధికమని అపుడే మూడు పార్టీలు కలిసి ఉంటే విజయం తమదేనని గుర్తు చేస్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయని గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చి 20 వేల వరకు ఓట్లు మెజార్టీతో తమ అభ్యర్థి గెలుస్తాడని ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు,కార్యకర్తలు కూడా అప్పట్లో ఉన్న తేడా స్వల్పమేనని ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పట్ల పలువురు ఓటర్లు ఆకర్షితులు అయ్యారని పదివేల ఓట్లుకు పైగా మెజార్టీతో వైసీపీ అభ్యర్థి శ్రీనివాసనాయుడు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జూన్ 4న ఓట్లు లెక్కింపు జరిగే వరకు ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ధీమా వ్యక్తం చేయడం తప్పదు.