CM Chandrababu: ప్రజలు తిరస్కరించినా జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదు
ABN , Publish Date - Jul 20 , 2024 | 09:41 PM
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈరోజు (శనివారం) భేటీ అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఈ సమావేశం జరిగిన సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది.
అమరావతి: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈరోజు (శనివారం) భేటీ అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఈ సమావేశం జరిగిన సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఉడవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీకి ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఈసందర్భంగా శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత దాడులకు మాజీ సీఎం జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని పోలీసులకు ఆదేశించారు. పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. తప్పులు చేసి తప్పించుకుంటామంటే కుదరదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
జగన్ హింసా రాజకీయాలంటూ తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. తప్పు చేస్తే తప్పించుకోలేమనే భయం కల్పిస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రజలు తిరస్కరించినా జగన్ ప్రవర్తనలో మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు. జగన్ బెదిరింపులకు భయపడం.. కుట్రలను సాగనివ్వమని చంద్రబాబు అన్నారు. వినుకొండ ఘటనకు వ్యక్తిగత కక్షలే కారణమని వైసీపీ నేతలే చెప్పారని గుర్తుచేశారు. వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలిందని స్పష్టం చేశారు. వ్యక్తిగత కక్షతో హత్య జరిగినా వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. టీడీపీ అంటేనే బెస్ట్ లా అండ్ ఆర్డర్ అని అంతా భావిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రుల నుంచి వివిధ శాఖల సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో ఎంపీలు సంప్రదింపులు జరపాలని చంద్రబాబు సూచించారు. పరిస్థితిని బట్టి రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీపడాలన్న సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో జగన్ ధర్నాపైనా చర్చించారు. జగన్, వైసీపీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఎంపీలు తెలిపారు. జగన్ గురించి ఆలోచించే సమయాన్ని.. రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి తెలిపారు.