CWC Meeting: : ముగిసిన సీడబ్ల్యూసీ.. సమావేశంలో ఏం చర్చించారంటే..?
ABN , Publish Date - Nov 29 , 2024 | 08:35 PM
నుదీర్ఘంగా సీడబ్ల్యూసీ సమావేశం 5 గంటల పాటు జరిగిందని.. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించామని సీడబ్ల్యూసీ మెంబర్ పల్లంరాజు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతి, ఇతర అంశాలపై చర్చించామని తెలిపారు.
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో 'ఇండియా' కూటమి ఫలితాలు సాధించలేకపోవడం, భవిష్యత్ కార్యాచరణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమీక్షించింది. నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పార్టీకి ఒక సవాలని శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఎన్నికల ఫలితాల నుంచి తక్షణమే గుణపాఠం నేర్చుకోవాలని, పార్టీ బలహీనతలను సరిదిద్దుకోవాలని దిశానిర్దేశం చేశారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే దిశా నిర్దేశం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో వాయనాడు లోక్‌సభ నుంచి విజయం సాధించిన ప్రియాంక గాంధీ, నాందేడ్ ఎంపీ రవీంద్ర వసంతరావు చహన్‌లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ మెంబర్ పల్లంరాజు మాట్లాడుతూ. . నుదీర్ఘంగా సీడబ్ల్యూసీ సమావేశం 5 గంటల పాటు జరిగిందని.. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించామని అన్నారు. పలు అంశాలపై సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతి, ఇతర అంశాలపై చర్చించామని తెలిపారు.
జమ్మూ హర్యానా, మహారాష్ట్ర, ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయని.. వాటికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించారని చెప్పారు. బీజేపీ మతపరమైన గొడవలు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల విధానంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారం శైలి అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపించారు. గతంలో కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో బ్యాలెట్ పేపర్ విధానం తీసుకురావాలని చర్చించామని అన్నారు. ఈవీఎం, వీవీప్యాట్ ట్యాలీ అయ్యే విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల కమిషన్‌కు లేఖలు అందిస్తాం: గిడుగు రుద్రరాజు
కాంగ్రెస్ పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసే అంశంపై చర్చించామని కాంగ్రెస్ సీనియర్ నేత గిడుగు రుద్రరాజు తెలిపారు. అదాని అవినీతిపై సమావేశంలో చర్చించామని అన్నారు. జమ్మూ కాశ్మీర్, ఝార్ఖండ్, హర్యానా మహారాష్ట్ర, ఎన్నికలపై సమావేశంలో మాట్లాడామని తెలిపారు. ఓడిపోయిన రాష్ట్రాల్లో త్వరలో కమిటీలను ఏర్పాటు చేసి ఓటమికి గల కారణాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈవీఎంలపై అభ్యంతరాలపై ఎన్నికల కమిషన్‌కు లేఖలు అందిస్తామన్నారు. రానున్న రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చిస్తామని చెప్పారు. పార్టీలో డిసిప్లిన్‌పై కూడా చర్చించామన్నారు. మహారాష్ట్ర ఓటమిపై త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించామని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.