Minister Lokesh: బుడమేరు గండి పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేశ్..
ABN , Publish Date - Sep 07 , 2024 | 12:25 PM
బుడమేరు గండి పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. ఈ మేరకు గండి పూడ్చివేత పనులపై మంత్రి నిమ్మల, అధికారులను అడిగి నారా లోకేశ్ వివరాలు తెలుసుకున్నారు.
అమరావతి: బుడమేరు గండి పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. ఈ మేరకు గండి పూడ్చివేత పనులపై మంత్రి నిమ్మల, అధికారులను అడిగి నారా లోకేశ్ వివరాలు తెలుసుకున్నారు.
కాసేపట్లో పూర్తి..
ఏపీ ప్రభుత్వ వివిధ శాఖల సమన్వయంతో అనుకున్న దాని కంటే తక్కువ సమయంలోనే మూడో గండి పూడ్చివేత పనులు సాగుతున్నట్లు లోకేశ్‌కు మంత్రి నిమ్మల తెలిపారు. ఇప్పటికే రెండు చోట్ల పడిన గండ్లను అధికారులు పూడ్చివేశారని తెలిపారు. మూడో గండి 95మీటర్లు పడగా.. ఇప్పటికే 83మీటర్ల మేర పూడ్చివేత పనులు పూర్తయినట్లు లోకేశ్‌కు వివరించారు. మరికొన్ని గంటల్లోనే మిగిలిన పనులు పూర్తి కానున్నాయని అధికారులు సైతం వివరించారు. ఈ మేరకు స్పందించిన లోకేశ్.. పూడ్చివేత పనులు త్వరగా ముగించాలని, ఆ తర్వాత వెంటనే బుడమేరు గట్టు పటిష్ఠత పనులు వేగవంతం చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మలకు విజ్ఞప్తి చేశారు.
బురద జల్లుతున్నారు..
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటనలపై ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. నిరంతరం ప్రజల కోసం ఆయన పడే కష్టం చూస్తుంటే స్ఫూర్తి రగులుతోందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు వచ్చే దాకా చంద్రబాబు సర్కార్ ప్రజల వెంటే ఉంటుందని చెప్పుకొచ్చారు. తమ తప్పు వల్ల జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
పండగ రోజూ..
వినాయక చవితి పండగ రోజు సైతం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఉండి ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పనులు పర్యవేక్షిస్తున్నారంటే ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఈ వయసులో కూడా యువనేతలతో సమానంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారని ఆయన అభినందించారు. మరోవైపు బుడమేరు మూడు గండ్లు పూడ్చడం దాదాపు పూర్తయిందని ఎంపీ చెప్పారు. మరికాసేపట్లో నీరు లీక్ అవ్వడం పూర్తిగా ఆగిపోతుందని వెల్లడించారు. అయితే జక్కంపూడి లాంటి కాలనీలు ఇంకా నీటిలో ఉన్నాయని, అక్కడ ఉన్న నీరంతా త్వరలోనే తోడేస్తామని ఎంపీ చిన్ని చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Leopard: లాలాచెరువులో చిరుతపులి సంచారం.. అప్రమత్తమైన అధికారులు..
Tirumala: తిరుమలలో విషాదం.. గుండెపోటుతో మహిళ మృతి..
IMA Guntur: వరద బాధితులకు అండగా.. ఐఎంఏ గుంటూరు బ్రాంచ్..