Share News

Ration Mafia: తిరువూరులో రెచ్చిపోతున్న రేషన్ బియ్యం మాఫియా..

ABN , Publish Date - Sep 16 , 2024 | 08:04 AM

తిరువూరులో గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారికి మరో వ్యాపారికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఏ.కొండూరు మండలం గోపాలపురం వద్ద ఒక రేషన్ వ్యాపారికి చెందిన లారీని మరో వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు.

Ration Mafia: తిరువూరులో రెచ్చిపోతున్న రేషన్ బియ్యం మాఫియా..

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియా రోజురోజుకీ రెచ్చిపోతోంది. ప్రజల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువకు అమ్ముకునేందుకు అలవాటు పడ్డ అక్రమార్కులు దాడులు, ప్రతి దాడులు చేసుకుంటూ బెంబేలెత్తిస్తున్నారు. అక్రమ వ్యాపారుల మధ్య పోరు ఎలా ఉందంటే.. ఒకరి లారీలు మరొకరు పోలీసులకు పట్టించడం, ఒకరిపై మరొకరు దాడులు చేసుకునేంతగా పెరిగిపోయింది. ఆధిపత్యం కోసం ఇరువర్గాలూ యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


తిరువూరులో గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారికి మరో వ్యాపారికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఏ.కొండూరు మండలం గోపాలపురం వద్ద ఒక రేషన్ వ్యాపారికి చెందిన లారీని మరో వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు. తమ కారును లారీకి అడ్డుగా పెట్టి కదలకుండా చేశారు. దీంతో డ్రైవర్ తమ వర్గం వారికి సమాచారం అందించాడు. ఆగ్రహించిన ఆ వ్యాపారి తన మనుషులను అక్కడికి పంపాడు. బొలేరో వాహనంలో వచ్చిన వారు అడ్డుపెట్టిన కారు బలంగా ఢీకొట్టారు. అనంతరం నలుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.


గాయపడిన వర్గం వారు రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని సీజ్ చేశారు. అందులోని పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ లారీని పట్టించడంతో వేరే వర్గానికి చెందిన వాహనం గురించి వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు, రెవెన్యూ అధికారులు కంచికచర్ల వద్ద పట్టుకున్నారు. అయితే ఆధిపత్యం కోసం వీరు ప్రాణాలు సైతం తీసుకునేలా ఉన్నారంటూ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి వారి ఆట కట్టించాలని పోలీసులను కోరుతున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 08:05 AM