Avanigadda: రెచ్చిపోయిన శాండ్ మాఫియా.. అడ్డంగా దొరికిపోయి ఆపై..
ABN , Publish Date - Oct 28 , 2024 | 08:56 PM
ఇసుక ఉచిత పంపిణీ పథకం ప్రారంభం రోజున ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ ఇసుక అక్రమ తరలింపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు ఎవరూ ఇసుక జోలికి వెళ్లొద్దని స్పష్టంగా చెప్పారు.
కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) చెప్పినప్పటికీ కొంత మంది అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా ఇసుక తరలిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇదేమిటని అక్రమార్కులను ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ప్రాణాలు తీసేంత పని చేస్తున్నారు. వైసీపీ హయాం నుంచీ అక్రమ రవాణాకు అలవాటు పడిన కేటుగాళ్లు ఆ పని మానేందుకు ససేమిరా అంటున్నారు.
ఇసుక ఉచిత పంపిణీ పథకం ప్రారంభం రోజున ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ ఇసుక అక్రమ తరలింపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు ఎవరూ ఇసుక జోలికి వెళ్లొద్దని స్పష్టంగా చెప్పారు. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని సూచించారు. అలాగే ఇతరులెవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఎన్డీయే ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఆర్డర్‌ను బేఖాతరు చేస్తూ కొంతమంది అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం ఆముదార్లంక వద్ద కృష్ణానది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. గ్రామస్థుల సమాచారంతో దాడి చేసిన రెవెన్యూ అధికారులు ఆముదార్లంక రేవు నుంచి ఇసుక తరలిస్తున్న 30 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ తరలింపు దారులంతా గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తులుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు తహసీల్దార్ వనజాక్షి ఆదేశాల మేరకు లోడుతో ఉన్న 20 ట్రాక్టర్లను చల్లపల్లి పోలీస్ స్టేషన్‌కు రెవెన్యూ సిబ్బంది తరలించారు.
అయితే అడ్డంగా దొరికిపోయిన కేటుగాళ్లు తాము మంత్రిగారి తాలూకా అంటూ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారు. డ్రైవర్లు సైతం రెవెన్యూ అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. వదిలిపెట్టాలంటూ వాగ్వాదానికి దిగారు. మరోపక్క ఇసుక తవ్వకాలు, తరలింపు కారణంగా గ్రామ రహదారి పూర్తిగా కృంగిపోయిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల, పెండ్యాల ఇసుక ర్యాంపులు, స్టాక్ పాయింట్లను సైతం రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఎవరైనా ఇసుక పాలసీకి విరుద్ధంగా అక్రమ రవాణా చేసినా, అక్రమంగా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రిపూట ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: చంద్రబాబు నివాసం దగ్గర భద్రతపై జీవో విడుదల
Vijayawada: విజయవాడ కోర్టు వద్ద రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. ఉద్రిక్త పరిస్థితులు..