Share News

Rain Alert: అలర్ట్.. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్..

ABN , Publish Date - Sep 01 , 2024 | 02:14 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం, అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై వరదనీరు భారీగా చేరింది.

Rain Alert: అలర్ట్.. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్..

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం, అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై వరదనీరు భారీగా చేరింది. దీంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మునేరు, వైరా, కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రహదారిపైకి నీరు చేరింది. రోడ్డుకు రెండువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు చెప్తున్నారు.


మత్స్యకారుల కోసం గాలింపు..

మరోవైపు సముద్రంలో వేటకు వెళ్లి బాపట్ల జిల్లా చిన్నగంజాం మత్స్యకారులు తప్పిపోయారు. చెన్నై నుంచి విశాఖపట్నం చేపల వేటకు బోట్లలో వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ లభించడం లేదు. విశాఖ సముద్రతీరంలో బోట్ చిక్కుకున్నట్లు సమాచారం. బాధితులను రక్షించాలంటూ హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని దృష్టికి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్స్ సిబ్బంది సముద్రతీరంలో మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


మంత్రి పర్యటన..

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం ఆయకట్టు ప్రాంతంలో భారీ వర్షాలకు నీట మునిగిన పొలాలను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. చంద్రబాబు సర్కార్ రైతులకు అండగా ఉంటుందని, రైతన్నలు అధైర్య పడొద్దంటూ మంత్రి ధైర్యం చెప్పారు. తుపాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులను ముందస్తుగా ఆస్పత్రికి తరలించాలని నిమ్మల ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Rains Effect: విషాదాన్ని మిగులుస్తున్న భారీ వర్షాలు..

Rain Effect: వర్ష ప్రభావిత ప్రాంతాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా..

Rains: ఎన్టీఆర్ జిల్లాను ముంచెత్తిన వరదలు..

Rains: భారీ వర్షాలతో జలాశయాలకు పెరుగుతున్న వరదనీరు..

Updated Date - Sep 01 , 2024 | 02:26 PM