MLA Somireddy: సీఎం చంద్రబాబు పనితనాన్ని అన్ని రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయి..
ABN , Publish Date - Sep 14 , 2024 | 03:10 PM
ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సేవల్ని అన్ని రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు ప్రశంసిస్తున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించి సేవలు చేయాలో సీఎం చంద్రబాబు ఉదాహరణగా మిగిలారని ఢిల్లీలో చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన చిత్తశుద్ధిని అన్ని రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు ప్రశంసిస్తున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించి సేవలు చేయాలో సీఎం చంద్రబాబు ఉదాహరణగా మిగిలారని ఢిల్లీలో చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు. అలాంటిది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎన్డీయే ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటకెక్కించారు..
ఏలేరు రిజర్వాయర్ మునిగి రెండు వేల ఎకరాల్లో పంటనష్టం జరగడం వాస్తవమేనని ఎమ్మెల్యే సోమిరెడ్డి వెల్లడించారు. తాజాగా వచ్చిన వరదలకు ఏలేరులో 48వేల క్యూసెక్కుల నీరు ప్రవహించిందని తెలిపారు. ఆ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చంద్రబాబు సర్కార్, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం 10వేల క్యూసెక్కుల సామర్థ్యం గల ఏలేరు రిజర్వాయర్‌ను 70వేల క్యూసెక్కులకు పెంచి పనులు చేపట్టిందని, కానీ ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ పనులని అటకెక్కించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వైసీపీ హయాంలో 17వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి కాకినాడ వరకూ మునిగిపోయిందని సోమిరెడ్డి మండిపడ్డారు.
సెల్ఫీలా..?
తూ.గో.జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ సీఎం జగన్ చేసిన పనులకు ప్రజలు నోరెళ్లబెట్టారని సోమిరెడ్డి చెప్పారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే ఈయన మాత్రం కార్యకర్తలతో సెల్ఫీలు తీసుకుంటూ, టపాసులు పేల్చి సరదాగా గడిపారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన పనులు చూసి స్థానిక ప్రజలు అవాక్కయ్యారని మండిపడ్డారు. పరామర్శను వైసీపీ అధినేత రాజకీయ విమర్శలు చేసేందుకు వినియోగించుకున్నారని ధ్వజమెత్తారు. జగన్‌కు కనీసం క్యూసెక్కులు, టీఎంసీలు, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోలకు కూడా తేడా తెలియదని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలను మూతేశారని మండిపడ్డారు. గత టీడీపీ పాలనలో ఇరిగేషన్ శాఖలో రూ.80వేల కోట్ల పనులు చేపట్టామని, జగన్ రూ.20వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. వారి పాలనలో రికార్డింగ్ డ్యాన్స్ మాస్టర్‌ని ఇరిగేషన్ మినిస్టర్ చేశారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
రూ.కోటి ఇస్తావా?
మాజీ సీఎం జగన్ కుటుంబానికి రూ.3.5లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలిపారు. కానీ వరద బాధితులకు ఆయన కేవలం రూ.కోటి మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మీరు చంద్రబాబును విమర్శిస్తారా అంటూ సోమిరెడ్డి మండిపడ్డారు. బెంగుళూరు ప్యాలెస్ నుంచి జగన్ వరద బాధితుల కోసం రావడానికి నామోషీగా ఫీలయ్యారని సోమిరెడ్డి అన్నారు. అందుకే వరద ప్రాంతాల్లో పర్యటించలేదని, కేవలం తన అనుచరులున్న ప్రాంతాలకి వెళ్లి టపాసులు పేల్చి, సెల్ఫీలు దిగి వచ్చారని ధ్వజమెత్తారు.