Nandigama: గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం.. చివరికి ఆ విద్యార్థిని..
ABN , Publish Date - Sep 23 , 2024 | 09:24 PM
నందిగామ(Nandigama) నియోజకవర్గం చందర్లపాడు మండలం ముప్పాళ్ల(Muppalla) గురుకుల పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థిని కస్తాల అపర్ణ(12) మృతి చెందడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది.
ఎన్టీఆర్ జిల్లా: నందిగామ(Nandigama) నియోజకవర్గం చందర్లపాడు మండలం ముప్పాళ్ల(Muppalla) గురుకుల పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థిని కస్తాల అపర్ణ(12) మృతి చెందడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థిని గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. అయితే ఆ విషయాన్ని పాఠశాల సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. రోజురోజుకూ ఆమె ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమించింది. దీంతో అపర్ణ కుటుంబసభ్యులకు గురుకుల సిబ్బంది సమాచారం ఇచ్చారు.
పాఠశాలకు చేరుకున్న బంధువులు విద్యార్థిని బాగా నీరసంగా ఉండడాన్ని గమనించి హుటాహుటిన నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి అప్పటికే విషమించడంతో చికిత్సపొందుతూ బాలిక మృతిచెందింది. దీనిపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేకపోతే ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహానికి గురయ్యారు. బాలిక మృతికి గురుకుల సిబ్బందే కారణమంటూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.