Share News

Delhi : నేటి నుంచి 18వ లోక్‌సభ సమావేశాలు

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:55 AM

18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు.

Delhi : నేటి నుంచి 18వ లోక్‌సభ సమావేశాలు

ఉదయం 11 గంటలకు మోదీ ప్రమాణం

తొలి రోజు ఏపీ, రెండో రోజు తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారం

26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక

జూలై 3 వరకు సమావేశాలు

న్యూఢిల్లీ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): 18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మొత్తం 280 మంది లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయిస్తారు. స్పీకర్‌ ఎన్నిక జరిగే వరకు ప్రొటెం స్పీకర్‌కు సహాయంగా సురేష్‌ కోడికున్నిల్‌, టీఆర్‌ బాలు, రాధామోహన్‌ సింగ్‌, ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే, సుదీప్‌ బంధోపాధ్యాయ వ్యవహరిస్తారు. రెండో రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక్కో ఎంపీ ప్రమాణానికి ఒక నిమిషం సమయం ఉంటుంది.

ప్రధాని మోదీ క్యాబినెట్‌లోని మంత్రుల్లో 58 మంది లోక్‌సభ సభ్యులు, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు లూధియానా నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడం గమనార్హం. లోక్‌సభ సమావేశాలు జూలై 3 వరకు కొనసాగనున్నాయి. కాగా, లోక్‌సభలో తొలి రోజే ఏపీకి చెందిన 25 మంది సభ్యులు ప్రమాణం చేయనుండగా, రెండో రోజు తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మూడో రోజైన 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది.


రాజ్యాంగంలోని 93వ ఆర్టికల్‌ ప్రకారం లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగుతూ వస్తోంది. సహజంగా అధికార పక్షానికి చెందిన ఎంపీకి స్పీకర్‌ పదవి, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థికి డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ప్రతిపక్షాలకు ఇచ్చే ఉపసభాపతి పదవిని తమకు ఇవ్వాలని ఇండియా కూటమి డిమాండ్‌ చేస్తోంది. 17వ లోక్‌సభలో బీజేపీకి చెందిన ఓంబిర్లా స్పీకర్‌గా ఉన్నారు. ఉపసభాపతి స్థానానికి ఎవరినీ ఎంపిక చేయకపోవడం వల్ల ఆ పదవి ఐదేళ్లు ఖాళీగా ఉంది.

ఈ సారి ఉపసభాపతిని ఇండియా కూటమికి ఇస్తుందా? లేదా ఎన్డీయే మిత్రపక్షాల్లో ఎవరికైనా అప్పగిస్తుందా? అన్నది వేచిచూడాల్సిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 27న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ 2న లోక్‌సభలో, 3న రాజ్యసభలో ప్రసంగిస్తారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌తోపాటు సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్‌, సంజయ్‌, శ్రీనివాస వర్మలు తొలిరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 04:56 AM