Jammu and Kashmir: అభివృద్ధి, శాంతిభద్రతలకు భరోసా.. బీజేపీ జమ్మూకశ్మీర్ మేనిఫెస్టో విడుదల
ABN , Publish Date - Sep 06 , 2024 | 05:36 PM
కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.18,000 ఇచ్చేందుకు 'మా సమ్మాన్ యోజన' అనే పథకం తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉజ్వల స్కీమ్ కింద ఏటా రెండు సిలెండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపింది. కాలేజీ విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్‌గా ఏటా రూ.3,000 ఇస్తామని హామీ ఇచ్చింది.
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (Jammu and Kashmir Assembly elections) మేనిఫెస్టో (Manifesto) బీజేపీ (BJP) విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) శుక్రవారంనాడు జమ్మూలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అభివృద్ధి, భద్రత, ఆర్థిక వృద్ధి తమ ప్రాధాన్యతాంశాలని మేనిఫెస్టోలో బీజేపీ స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో సుస్థిరత, ప్రగతికి బీజేపీ కట్టుబడి ఉంటుందని తెలిపింది.
జమ్మూకశ్మీర్ విషయంలో బీజేపీ చిరకాలంగా అనుసరిస్తున్న విధానాన్ని మేనిఫెస్టో విడుదల సందర్భంగా అమిత్‌షా ప్రస్తావిస్తూ, బీజేపీకి ఈ ప్రాంతంలో చారిత్రక అనుబంధం ఉందన్నారు. పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి ప్రముఖులు చేసిన కృషిని గుర్తుచేశారు. ''స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూకశ్మీర్ అంశం మా పార్టీకి కీలకంగా ఉంది. ఈ ప్రాంతాన్ని ఇండియాతో కలిపి ఉంచేందుకు మేము నిరంతరం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాం. కశ్మీర్ భారత అంతర్భాగం. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే కొనసాగుతుంది. కశ్మీర్ అభివృద్ధి భారత్ అభివృద్ధిలో భాగంగా ఉంటుంది. ఇందుకు బీజేపీ కృతనిశ్చయంతో ఉంది'' అని చెప్పారు.
Rajnath Singh: దేశ శాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదు: రాజ్‌నాథ్
370 అధికరణ రద్దు చారిత్రక నిర్ణయం
జమ్మూకశ్మీర్‌ను స్వయం ప్రతిపత్రి కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని అమిత్‌షా ప్రశంసించారు. తద్వారా జమ్మూకశ్మీర్‌లో శాంతి, ప్రగతి, సామాజిక న్యాయం సుసాధ్యమైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా నేషనల్ కాన్ఫరెన్స్ ఎజెండాను సమర్ధించిందని విమర్శించారు. మౌనం వల్ల లాభం లేదని, నేషనల్ కాన్ఫరెన్స్ ఎజెండాను అంగీకరిస్తున్నా లేదా అనేది రాహుల్ గాంధీ దేశ ప్రజలు, జమ్మూకశ్మీర్ ప్రజల ముందు వివరణ ఇవ్వాలన్నారు. 370వ అధికరణ అనేది గత చరిత్ర అని, ఎట్టి పరిస్థితుల్లోనూ పునరుద్ధరణ జరగదని చెప్పారు. ఆర్టికల్ 370 కారణంగానే జమ్మూకశ్మీర్ యువకులు హింస వైపు మళ్లారని గుర్తుచేశారు.
మేనిఫెస్టోలో కీలకాంశాలు..
కుటుంబ పెద్ద అయిన మహిళలకు ఏటా రూ.18,000 ఇచ్చేందుకు 'మా సమ్మాన్ యోజన' అనే పథకం తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉజ్వల స్కీమ్ కింద ఏటా రెండు సిలెండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపింది. 'ప్రగత శిక్షా యోజన' కింద కాలేజీ విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్‌గా ఏటా రూ.3,000 ఇస్తామని హామీ ఇచ్చింది. 'పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా రోజ్‌గార్ యోజన' కింద జమ్మూకశ్మీర్‌లో 5 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. మారమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తామన వాగ్దానం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.