రాజ్యసభలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
ABN , Publish Date - Sep 09 , 2024 | 04:28 AM
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఆరుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతుతో రాజ్యసభలో స్వల్ప ఆధిక్యం లభించింది. బీజేపీకి సొంతంగా 96 మంది ఎంపీలుండగా మొత్తం ఎన్డీయే ఎంపీల సంఖ్య 113.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఆరుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతుతో రాజ్యసభలో స్వల్ప ఆధిక్యం లభించింది. బీజేపీకి సొంతంగా 96 మంది ఎంపీలుండగా మొత్తం ఎన్డీయే ఎంపీల సంఖ్య 113. తాజాగా ఆరుగురు నామినేటెడ్ ఎంపీల మద్దతుతో ఎన్డీయే బలం 119కి పెరిగింది. నామినేటెడ్ ఎంపీలు సాధారణంగా ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారు. రాజ్యసభలో మొత్తం ఎంపీల సంఖ్య 234. సగం సంఖ్య 117 కాగా ఎన్డీఏ బలం రెండు ఎక్కువగా 119కి చేరినట్లైంది. వక్ఫ్ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాల్సిన తరుణంలో ఎన్డీయేకు మెజార్టీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 27 మంది సభ్యులున్నారు. మిత్రపక్షాలకున్న 58 మంది ఎంపీలతో కలిపి కాంగ్రెస్ బలం 85కు చేరింది. వైసీపీకి రాజ్యసభలో 9 మంది ఎంపీలుండగా బీజేడీకి ఏడుగురు, ఏఐఏడీఎంకేకు నలుగురు ఎంపీలున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలకు సంబంధించిన ఇతర ఎంపీలు కూడా ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో నాలుగు ఎంపీ స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా సభలో సభ్యుల సంఖ్య 241కి పరిమితమైంది. మొత్తం 11 ఖాళీలుండగా మరో నాలుగు ఏపీలో, ఒకటి ఒడిశాలో ఖాళీగా ఉన్నాయి. 4నామినేటెడ్ ఎంపీల స్ధానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. బీజేడీకి గుడ్‌బై చెప్పిన రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్ ఇటీవలే బీజేపీలో చేరారు. ఒడిశా అసెంబ్లీలో బీజేపీకి తగినంత బలం ఉండటంతో ఉప ఎన్నికల్లో సుజీత్ గెలుపు సునాయాసమే. వైసీపీ రాజ్యసభ ఎంపీలుమోపిదేవి వెంకట రమణ, మస్తాన్ రావు గత నెల తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వారిద్దరూ టీడీపీలో చేరే అవకాశముంది.