Share News

వరంగల్‌ నుంచి మణిపూర్‌కు.. సీఆర్పీఎఫ్‌ అదనపు బలగాలు

ABN , Publish Date - Sep 11 , 2024 | 05:42 AM

మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అదనంగా 2 వేల సీఆర్పీఎఫ్‌ బలగాలను తరలించింది. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్‌లో ఉన్న 58వ బెటాలియన్‌, ఝార్ఖండ్‌లోని 112 బెటాలియన్‌ నుంచి వీరిని తరలిస్తున్నట్లు సీఆర్పీఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

వరంగల్‌ నుంచి మణిపూర్‌కు.. సీఆర్పీఎఫ్‌ అదనపు బలగాలు

  • 2 వేల బలగాలను తరలిస్తున్న కేంద్రం

  • ఇంఫాల్‌లో మళ్లీ చెలరేగిన హింస

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అదనంగా 2 వేల సీఆర్పీఎఫ్‌ బలగాలను తరలించింది. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్‌లో ఉన్న 58వ బెటాలియన్‌, ఝార్ఖండ్‌లోని 112 బెటాలియన్‌ నుంచి వీరిని తరలిస్తున్నట్లు సీఆర్పీఎఫ్‌ అధికారులు వెల్లడించారు. కొత్తగా పంపే బలగాలు ఇంఫాల్‌ పరిసరాల్లో మోహరిస్తాయని వివరించారు. మణిపూర్‌ నుంచి అసోం రైఫిల్స్‌ను ఉపసంహరించుకుని, జమ్మూకశ్మీర్‌కు తరలించాలని నిర్ణయించామని, ఈ నేపథ్యంలోనే 2వేల మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను మణిపూర్‌కు తరలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 16 బెటాలియన్ల బలగాలు మణిపూర్‌లో ఉన్నట్లు గుర్తుచేశారు. మణిపూర్‌లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలి హింసాత్మక ఘటనలకు నిరసనగా మంగళవారం విద్యార్థులు రాజ్‌భవన్‌కు ర్యాలీ తీయడంతో భద్రతాబలగాలు అడ్డుకున్నాయి. ఈ ఘర్షణలో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ విషయం తెలియగానే.. విద్యార్థులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌ నివాసాలను ముట్టడించేందుకు యత్నించారు. ఇంఫాల్‌లోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. తాజా ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం మణిపూర్‌ వ్యాప్తంగా ఐదు రోజులపాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది.

Updated Date - Sep 11 , 2024 | 05:42 AM