Share News

Gender Change: అనుసూయ.. ఇక అనుకతిర్‌ సూర్య

ABN , Publish Date - Jul 11 , 2024 | 05:07 AM

దేశ సివిల్‌ సర్వీసెస్‌ చరిత్రలో తొలిసారిగా.. ఓ ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ ప్రభుత్వ రికార్డుల్లో తన పేరును, లింగాన్ని మార్పించుకున్నారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన 2013 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ ఎం.అనుసూయ..

Gender Change: అనుసూయ.. ఇక అనుకతిర్‌ సూర్య

  • తన పేరును, లింగాన్ని పురుషుడిగా

  • మార్చుకున్న మహిళా ఐఆర్‌ఎస్‌ అధికారి

  • దేశ సివిల్‌ సర్వీసెస్‌లోనే తొలిసారి

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): దేశ సివిల్‌ సర్వీసెస్‌ చరిత్రలో తొలిసారిగా.. ఓ ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ ప్రభుత్వ రికార్డుల్లో తన పేరును, లింగాన్ని మార్పించుకున్నారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన 2013 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ ఎం.అనుసూయ.. కొంతకాలంగా హైదరాబాద్‌లోని ‘కస్టమ్స్‌ ఎక్సైజ్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (సీఈఎ్‌సటీఏటీ)’ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయంలో జాయింట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇకపై తనను పురుషుడిగా అనుసూయ.. ఇక అనుకతిర్‌ సూర్య గుర్తించాలని.. ఎం.అనసూయకు బదులుగా తన పేరును ఎం.అనుకతిర్‌ సూర్యగా మార్చుకోవడానికి, రికార్డుల్లో తన లింగాన్ని మార్చుకోవడానికి అనుమతించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగానికి చెందిన ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్‌’ను అభ్యర్థించారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది.


ఈ మేరకు ఆ శాఖ అండర్‌ సెక్రటరీ శిరీ్‌షకుమార్‌ గౌతమ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ‘హైదరాబాద్‌లో జాయింట్‌ కమిషనర్‌గా పని చేస్తున్న ఎం.అనుసూయ తన పేరును ఎం.అనుకతిర్‌ సూర్యగా పేరు మార్చాలని, స్త్రీ నుంచి పురుషుడిగా లింగాన్ని మార్చాలంటూ మాకు విజ్ఞప్తి చేశారు. ఆమె అభ్యర్థనను ఆమోదిస్తున్నాం. ఆ అధికారిణిని ఇక మీదట ఎం.అనుకతిర్‌ సూర్యగా ప్రభుత్వ రికార్డులన్నింటిలో గుర్తిస్తున్నాం’’ అని అందులో పేర్కొన్నారు. లింగ మార్పిడికి సంబంధించి 2014లో ‘నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా)’ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పులో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తాము పురుషులుగా ఉండాలా లేక మహిళలుగా ఉండాలా అనేది వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేసింది.


ట్రాన్స్‌జెండర్ల కనీస మానవ హక్కులను తిరస్కరించడానికి ఎలాంటి సమర్థనా లేదని అభిప్రాయపడింది. ఒడిశాలో ఒక వాణిజ్య పన్నుల అధికారి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని.. ఆ తీర్పు ఆధారంగా రికార్డుల్లో తన లింగాన్ని, పేరును ఐశ్వర్య రితుపర్ణ ప్రధాన్‌గా మార్పించుకున్నారు. కాగా, చెన్నైలోని మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా పొందిన అనుకతిర్‌ సూర్య.. 2013 డిసెంబరులో చెన్నైలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొంది.. గత సంవత్సరమే బదిలిపై హైదరాబాద్‌కు వచ్చి జాయింట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2023లో భోపాల్‌లోని నేషనల్‌ లా యూనివర్సిటీలో ‘పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ లా అండ్‌ సైబర్‌ ఫోరెన్సిక్స్‌’ కోర్సును పూర్తి చేశారు.

Updated Date - Jul 11 , 2024 | 07:26 AM