Kishan Reddy : జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం పూర్తికాలేదు
ABN , Publish Date - Jun 20 , 2024 | 05:30 AM
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు.
యుద్ధప్రాతిపదికన పూర్తిచేసే
బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదే
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు
కావాలనే దీనిపై రాద్ధాంతం: కిషన్రెడ్డి
‘ఆంధ్రజ్యోతి’కి కేంద్ర మంత్రి ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. దానిని యుద్థ ప్రాతిపదిక పూర్తిచేసే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బుధవారం తొలిసారిగా ఢిల్లీలోని తన కార్యాలయంలో ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
విశాఖ ఉక్కు రేపో ఎల్లుండో ప్రైవేటుపరం అవుతుందనేది అసత్య ప్రచారమేనని.. కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు సంబంధించిన ఫైలే ఇంకా ముందుకు కదల్లేదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాప్టివ్ మైన్స్ అవసరమని, దీని గురించి చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సింగరేణిప్రైవేటీకరణ అనేది కూడా పచ్చి అబద్థమన్నారు. ఇదంతా కేసీఆర్ ఆడిన నాటకమని ఆరోపించారు. గత పదేళ్లలో దేశంలో ఒక్క బొగ్గు గనినైనా ప్రైవేటీకరించామా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారని, వారి నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలబెడుతుందని చెప్పారు.